ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం వేకువజామున వరుస పేలుళ్లు సంభవించాయి. గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం వెలుపల, దేశ ఆపద్ధర్మ ప్రభుత్వ పాలకుడు యూనస్ మహ్మద్ అనుచరుడికి చెందిన వ్యాపార సంస్థ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మీర్‌పుర్‌లో ఉన్న గ్రామీణ బ్యాంకు వద్దకు బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు రోడ్డుపై పెట్రోల్ బాంబులను విసిరివెళ్లారు’అని వివరించారు.
అదేవిధంగా, మహ్మద్‌పూర్‌లోని ప్రొబర్తన అనే ఆహార ఉత్పత్తుల కంపెనీ ఆవరణలో ఇలాంటి మరో రెండు పేలుళ్లు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ కంపెనీ యజమాని యూనస్ ప్రభుత్వంలో మత్స్యశాఖను పర్యవేక్షిస్తున్న ఫరిదా అఖ్తర్ అనుచరుడని చెప్పారు. అదేవిధంగా, నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు బస్సులకు నిప్పుపెట్టారు. ఈ మూడు ఘటనల్లో ఎవరికీ ఎలాంటి అపాయం సంభవించలేదన్నారు.
అనుమానితుడొకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. ఇతడు పదవీచ్యుత ప్రధాని హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ అనుబంధ విద్యార్థి సంఘ సభ్యుడని చెప్పారు. ఇతడికి గతంలోనూ అనే పేలుళ్లతో సంబంధముందన్నారు. వీటితోపాటు ధన్‌మోండి మార్కెట్ ప్రాంతంలో రెండు చోట్ల పెట్రోల్ బాంబులు పేలాయి. ఢాకా పాతనగరంలో ఓ ఆస్పత్రి వద్ద దుండగులు ఒకరిని కాల్చి చంపారు. కాగా, ఆపద్ధర్మ ప్రభుత్వప్రధాన సలహాదారుగా ఉన్న యూనస్, 1983లో గ్రామీణ బ్యాంకును స్థాపించారు. పేదరికాన్ని తొలగించేందుకు, మహిళల సాధికారతకు పాటుపడుతున్న యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవడం తెల్సిందే.


