
వాషింగ్టన్: అత్యంత సంపన్నులు, ఉన్నతాధికారుల కోసం అమెరికా ఏకంగా భూగర్భ నగరమే నిర్మించిందట! ఆ దేశా మాజీ ఉన్నతాధికారి కేథరిన్ ఆస్టిన్ ఫిట్స్ ఈ మేరకు వెల్లడించారు. అంతేకాదు, అందుకు ఏకంగా 21 లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రజల సొమ్మును వెచ్చించిందని ఆరోపించారు. జార్జ్ హెచ్.డబ్లు్య.బుష్ అధ్యక్షునిగా ఉండగా కేథరిన్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేశారు.
తాను చెబుతున్నది పచ్చి నిజమని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘21 లక్షల కోట్ల డాలర్లు లెక్కాపత్రం లేకుండా మాయమయ్యాయి. ఎక్కడికి పోయాయని ఏళ్ల తరబడి పరిశోధించా. వాటిని 170 భూగర్భ స్థావరాలతో కూడిన భారీ నెట్‌వర్క్ నిర్మాణానికి వెచ్చించినట్టు చివరికి కనిపెట్టా. వాటి మధ్య అత్యాధునిక రవాణా తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. 1998 నుంచి 2015 వరకు రక్షణ, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖల్లో అత్యంత భారీ మొత్తాలను అనధికారికంగా ఖర్చు చేసినట్లు మిషిగన్ స్టేట్ వర్సిటీ ఆర్థికవేత్త మార్క్ స్కిడ్మోర్ అధ్యయనంలో కూడా వెల్లడైంది’’అని చెప్పుకొచ్చారు.
కేథరిన్ చెబుతున్న బంకర్లలో కొన్ని సముద్రం అడుగున కూడా ఉన్నట్లు సమాచారం. ‘‘అమెరికాలో భూగర్భంలోనూ, సముద్రం అడుగునా ఈ స్థావరాలున్నాయి’’అని చెప్పారు. దాని పరిమాణం, పరిధి, యాక్సెస్ ప్రోటోకాల్స్ తదితర వివరాలేవీ ఆమె బయటపెట్టలేదు. విపత్తుల వేళ ఆ బంకర్లలోకి ప్రవేశమున్న ఉన్నత వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించలేదు.