
భగ్నంచేసిన న్యూయార్క్ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ విభాగం
నగరంలో ఐరాస సర్వసభ్య సమావేశం వేళ తెగించిన ఆగంతకులు
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కోసం ప్రపంచదేశాల అగ్రనేతలు న్యూయార్క్ నగరానికి విచ్చేసిన వేళ ఐరాస ప్రధాన కార్యాలయం చుట్టుపక్కల సెల్ నెట్‌వర్క్‌ను స్తంభింపజేసేందుకు చేసిన కుట్రను నగర పోలీసులు విజయవంతంగా భగ్నంచేశారు. న్యూయార్క్ నగరవ్యాప్తంగా సెల్‌ఫోన్ టవర్ల కార్యకలాపాలను స్తంభింపజేసి, ఎమర్జెన్సీ ‘911’ నంబర్ సైతం పనిచేయకుండా చేయగలిగేంతటి భారీ అక్రమ ఎలక్ట్రానిక్ ఉపకరణాల నెట్‌వర్క్ గుట్టును నగర పోలీసులు రట్టుచేశారు.
300కుపైగా కో–లొకేటెడ్ సిమ్ సర్వర్లు, ఏకంగా 1,00,000 సిమ్ కార్డులను స్వాధీనంచేసుకున్నారు. ఇవన్నీ ఐరాస ప్రధానకా ర్యాలయ భవనానికి చుట్టూతా 35 మైళ్లదూరంలో ఉండటం గమనార్హం. ఐరాస సమావేశాల కోసం ప్రధానకార్యాలయానికి విచ్చేసిన ప్రపంచనేతలను ఒకేసారి భయపెట్టి, బెదిరించే ఎత్తుగడలో భాగంగా ఆగంతకులు ఈ సెల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మన టెలీకమ్యూనికేషన్ వ్యవస్థను సవాల్ విసిరేలా ఈ సెల్ నెట్‌వర్క్‌ను ఆగంతకులు సిద్ధంచేశారని అమెరికా నిఘా విభా గమైన సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కర్రన్ వెల్లడించారు.
నిమిషానికి 3 కోట్ల టెక్స్ మెసేజ్‌లు..
ఈ భారీ అక్రమ నెట్‌వర్క్ సామర్థ్యం చాలా పెద్దది. నిమిషానికి ఏకంగా 3 కోట్ల టెక్సŠట్ మెసేజ్‌లను దీని ద్వారా పంపొచ్చు. ఇంతటి భారీ స్థాయిలో నెట్‌వర్క్ రద్దీతో వ్యవస్థ హఠాత్తుగా క్రాష్ అవుతుంది. దీంతో సెల్‌ఫోన్ టవర్లు సామర్థ్యానికి మించి మెసేజ్‌ల రాకపోకలను తట్టుకోలేక చేతులెత్తేస్తాయి. అప్పుడు ఏమౌతుందో ఊహించుకోండి. సెల్ నెట్‌వర్క్ నిలిచిపోతుంది. కనీసం మీ సెల్‌ఫోన్‌ను ఉపయోగించలేరు. ఐరాస సర్వసభ్య సమావేశాల మీదా దీని ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. యావత్ నగరంలో సెల్ ప్రపంచం ఆగిపోతుంది.
ఇది మొత్తం గందరగోళానికి, ఒక కొత్త భయభ్రాంతులకు దారితీస్తుంది’’ అని సీక్రెట్ సర్వీస్ న్యూయార్క్ ఫీల్డ్ ఆఫీస్‌లో స్పెషల్ ఏజెంట్ మ్యాట్ మెక్‌కూల్ వివరించారు. ‘‘ దీని విస్తృతి, తీవ్ర ప్రభావం, లొకేషన్‌పై మాకు సరైన సమయానికి ఉప్పందింది. దాంతో వెంటనే పలు చోట్ల ఆకస్మిక దాడులు చేసి వందల కొద్దీ ఉపకరణాలను షట్‌డౌన్ చేశాం’’ అని ఆయన వెల్లడించారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వంలోని సీనియర్ ఉన్నతాధికారులపై టెలికమ్యూనికేషన్స్ ద్వారా బెదిరింపులు ఎక్కువవడంతో ఈ తరహా నేరాలపై నిఘాను పెంచారు. దీంతో తాజాగా ఈ సెల్ టవర్ నెట్‌వర్క్ రాకెట్ బయటపడింది. ఇప్పటికే 1,00,000 సిమ్‌కార్డులను క్రియాశీలంచేశారని, మరి కొన్నింటినీ యాక్టివేషన్ కోసం ఆగంతకులు సిద్ధంచేశారని పోలీసులు పేర్కొన్నారు.
కుట్ర కారకులు ఎవరు?
కుట్రదారులు ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. నేర ముఠాలు, డ్రగ్ కార్టెల్స్ ముఠాలు, ఉగ్రసంస్థలను పెంచి పోషించే దేశాలకు ఈ సెల్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉండి ఉంటుందని న్యూయార్క్ పోలీసులు భావిస్తున్నారు. ఇంతటి భారీ నెట్‌వర్క్‌ను నెలకొల్పాలంటే ఈ రంగంలో నిష్ణాతులైన వాళ్లకు సాధ్యం. అందుకే ఆ కోణంలోనూ దర్యాప్తు మొదలెట్టామని పోలీసులు తెలిపారు. కుట్రదారులు ఎవరనేది కనిపెట్టడం ఇప్పుడే కష్టమని, దీనికి చాలా సమయం పడు తుందని అంచనావేశారు. ‘‘మేం దీని కోసం భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది.
కనీసం 1,00,000 సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ బృందంతో తనిఖీచేయించి వాటిల్లోని సమాచారాన్ని క్రోడీకరించాల్సి ఉంది. ఈ సెల్‌ఫోన్ల నుంచి వెళ్లిన టెక్సŠట్ మెసేజ్‌లు, ఫోన్ సంభాషణలు అన్నింటినీ చెక్ చేయాలి. చివరకు ఏ పెద్ద తలకాయ బయటపడుతుందో చూడాలి మరి’’ అని స్పెషల్ ఏజెంట్ మ్యాట్ మెక్‌కూల్ అన్నారు. ‘‘ ఖరీదైన ఇలాంటి పరికరాలను ఇన్నేసి చొప్పున అమర్చా లంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ నైపుణ్యం చిన్న దేశాలకు అస్సలు ఉండదు. రష్యా, చైనా, ఇజ్రా యెల్ లాంటి సాంకేతికతో రాటుదేలిన దేశాలకే ఇది సాధ్యం’’ అని సెంటర్ ఫర్ యురోపియన్ పాలసీ అనాలసిస్ సంస్థలో సీనియర్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేమ్స్ ఎ.లేవిస్ వ్యాఖ్యానించారు.