విశాఖ చిల్డ్రన్స్ ఎరీనా వద్ద బైఠాయించిన పార్టీ నేతలు
వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనా గేట్‌కు తాళం వేసిన పోలీసులు
రోడ్డు మీదే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 1,400 మంది వైఎస్సార్‌సీపీలో చేరిక
సాక్షి, విశాఖపట్నం: పోలీసులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్‌సీపీపై చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. సోమవారం విశాఖలోని సిరిపురం సమీపంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకుంది. చేరికల కార్యక్రమం నిర్వహణకు వీఎంఆర్‌డీఏకు వైఎస్సార్‌సీపీ రూ.71,300 చెల్లించి అధికారికంగా అనుమతి తీసుకుంది. ఈ కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు, పార్టీ నేతలు వుడా చిల్డ్రన్స్ థియేటర్ వద్దకు చేరుకోగా.. దీన్ని చూసి ఓర్వలేకపోయిన కూటమి నేతలు ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు, చిల్డ్రన్స్ ఎరీనా సిబ్బందితో గేటుకు తాళం వేయించారు.
దీన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో చి్రల్డన్ థియేటర్ గేటు వద్ద మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు తదితరులు నిరసన తెలిపారు. అనంతరం గేటు వద్ద నగర ప్రముఖుడు ధర్మాన ఆనంద్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన 1,400 మంది కార్యకర్తలకు కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.


