సోషల్ మీడియాలో పెట్టిన ఓ కామెంట్.. ఆ యువకుడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తొలుత జైలు శిక్ష, భారీ జరిమానాకు దారితీసింది. ఆ తర్వాత శిక్ష తగ్గించాలని పిటిషన్ వేస్తే.. అది ఊహించని మలుపు తిరిగి మరణశిక్ష పడేలా చేసింది. దీంతో ఆ యువకుడి కుటుంబం తల్లడిల్లిపోయింది. అతన్ని కాపాడుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే.. సుప్రీం కోర్టు జోక్యంతో ఆ యువకుడికి భారీ ఊరట లభించింది.
శ్రీలంకకు చెందిన 24 ఏళ్ల హిందూ వలస కార్మికుడు అనోజన్ శివరాసా విషయంలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లాం ప్రవక్త మహమ్మద్‌పై అభ్యంతరకర వ్యాఖ్య చేశాడనే ఆరోపణలతో సౌదీ అరేబియా కోర్టు విధించిన మరణశిక్షను ఆ దేశ సుప్రీంకోర్టు అక్టోబర్ 13న రద్దు చేసింది. శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన దౌత్య, న్యాయపరమైన ప్రయత్నాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే అనోజన్‌కు పూర్తిగా విముక్తి లభించిందా? శిక్ష కొనసాగనుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అసలు వివాదం అక్కడే మొదలైంది..
ఈ ఏడాది జూన్ చివర్లో శ్రీలంకలో హిందూ యాత్రికులు వెళ్తున్న సమయంలో ఓ ముస్లిం యువకుడు కుక్కను తన్నుతున్నట్లు చూపించే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఫేస్బుక్లో మతపరమైన వాదోపవాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి హిందూ దేవతపై అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. దీనికి స్పందించిన సౌదీలో పనిచేస్తున్న శివ.. తమిళంలో ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్య చేశాడు. అది ఇస్లాంను, ప్రవక్తను అవమానించేలా ఉందంటూ వివాదం చెలరేగింది.

పరిస్థితి తీవ్రతను గుర్తించిన అనోజన్ కొద్దిసేపటికే ఆ కామెంట్‌ను తొలగించాడు. అనంతరం వీడియో ద్వారా క్షమాపణ కూడా చెప్పాడు. అయినప్పటికీ అప్పటికే ఆ వ్యాఖ్యకు సంబంధించిన స్క్రీన్షాట్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. శ్రీలంకలోని కొందరు వ్యక్తులు అనోజన్ పనిచేస్తున్న సౌదీ సంస్థకు ఈ వివరాలను ఈమెయిల్ చేశారు. దీంతో సౌదీ అధికారుల దృష్టికి ఈ వ్యవహారం వెళ్లింది. అనోజన్ ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
జైలు శిక్ష నుంచి మరణశిక్షకు..
జూలై 15న అల్-అహ్సా క్రిమినల్ కోర్టు అనోజన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల సౌదీ రియాళ్ల జరిమానా విధించింది. అది సుమారు 8 లక్షల అమెరికన్ డాలర్లకు సమానం. సౌదీ సైబర్ నేరాల చట్టం కింద ఈ శిక్ష విధించినట్లు కథనాలు పేర్కొన్నాయి.
అయితే కేసు అక్కడితో ముగియలేదు. సెప్టెంబర్ 17న సౌదీ అప్పీల్ కోర్టు ఆయనకు విధించిన అసలు శిక్షను పక్కనపెట్టి, షరియా చట్టం కింద దైవదూషణకు సంబంధించిన నేరంగా పరిగణిస్తూ మరణశిక్ష విధించింది. దీంతో అనోజన్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. సెప్టెంబర్ 28 తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోగా.. తమ కుమారుడికి ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
Mother of Anojan Sivarasa pleading.. This is painful to watch. Come on Saudi Arabia.. Give him an excuse.. and send him back to Sri Lanka 🙏 #Anojan https://t.co/GefBlpQKk4
— Nibraz Ramzan (@nibraz88cricket) October 11, 2026
శ్రీలంక ప్రభుత్వం దౌత్య ప్రయత్నాలు..
మరణశిక్షను రద్దు చేయించేందుకు శ్రీలంక ప్రభుత్వం దౌత్య, న్యాయపరమైన చర్యలను ముమ్మరం చేసింది. సెప్టెంబర్ 21న అనోజన్ కుటుంబ సభ్యులు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకను కలిసి తమ కుమారుడిని కాపాడాలని కోరారు. క్షమాభిక్ష కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. న్యాయపరమైన ఖర్చులను భరించేందుకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది.
మరోవైపు, శ్రీలంకకు చెందిన ఆరుగురు తమిళ, ముస్లిం ఎంపీలు సెప్టెంబర్ 24న సౌదీ విదేశాంగ మంత్రికి లేఖ రాసి అనోజన్పై కరుణ చూపించాలని కోరారు. శ్రీలంక రాయబారి అమీర్ అజ్వాద్ అక్టోబర్ 8న దమ్మామ్ సెంట్రల్ జైలులో అనోజన్ను కలిసి ఆయన పరిస్థితిని తెలుసుకున్నారు. జైలులో తోటి ఖైదీ దాడి చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఆజాద్ నవావి, ప్రెసిడెంట్స్ కౌన్సెల్ ఫైజర్ ముస్తఫా, ఉపుల్ కుమారపెరుమ, న్యాయవాది హఫీల్ ఫారిస్లతో కూడిన ప్రత్యేక న్యాయ బృందం కూడా కేసులో తదుపరి చర్యల కోసం రియాద్‌కు వెళ్లింది.
సుప్రీంకోర్టులో అప్పీల్.. మరణశిక్ష రద్దు
శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాల్లో కీలక పరిణామం అక్టోబర్ 13న చోటుచేసుకుంది. అక్టోబర్ 11న సౌదీ సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీల్ విచారణ అనంతరం అనోజన్‌కు విధించిన మరణశిక్షను కోర్టు రద్దు చేసింది. ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగ, విదేశీ ఉపాధి, పర్యాటక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 14న అధికారికంగా వెల్లడించింది.
మరణశిక్ష రద్దు కావడంతో అనోజన్ కుటుంబానికి పెద్ద ఊరట లభించినప్పటికీ, ఆయనపై ఉన్న నేరారోపణలన్నీ కొట్టివేశారా? లేక గతంలో విధించిన ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా మళ్లీ అమలులోకి వస్తాయా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ అంశంపై సౌదీ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
సోషల్ మీడియా వ్యాఖ్యలపై మరోసారి చర్చ
సౌదీ అరేబియాలో సోషల్ మీడియా పోస్టుల కారణంగా కఠిన శిక్షలు విధించిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2023లో సౌదీ మాజీ ఉపాధ్యాయుడు మహమ్మద్ అల్-ఘమ్దీకి సోషల్ మీడియా పోస్టుల కేసులో తొలుత మరణశిక్ష విధించగా, ఆ తర్వాత దాన్ని 30 ఏళ్ల జైలు శిక్షగా మార్చారు.
అనోజన్ కేసులోనూ మరణశిక్ష రద్దు కావడం కీలక పరిణామమే అయినప్పటికీ, ఆయనకు పూర్తిస్థాయిలో విముక్తి లభించే వరకు న్యాయపరమైన ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. క్షణికావేశంలో సామాజిక మాధ్యమాల్లో చేసే వ్యాఖ్యలు ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చో ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.
ఇదీ చదవండి: మిషిగాన్ స్పీకర్ రేసులో రణ్జీవ్! ఎవరీయన అంటే..


