బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు , ఉమ్రా యాత్ర సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఒకే కుటుంబంలోని 18 మంది గ్రూప్ ఫొటో
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో దుర్ఘటన
43 మంది హైదరాబాదీ ఉమ్రా యాత్రికుల సజీవ దహనం
మరో ఇద్దరు కర్ణాటకవాసుల మృత్యువాత
మక్కాను సందర్శించుకుని మదీనా వెళ్తుండగా దుర్ఘటన
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది
ఈ నెల 9న నగరం నుంచి వెళ్లిన 54 మంది
బస్సులో మదీనాకు బయలుదేరిన 46 మంది.. ఒక్కరు మినహా మిగతా వారంతా మృత్యువాత.. ఘోర ప్రమాదంతో హైదరాబాద్‌లో విషాదం..
ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి, సీఎం రేవంత్ తదితర ప్రముఖుల సంతాపం
సచివాలయంలో 79979 59754, 99129 19545 టోల్ ఫ్రీ నంబర్లతో కంట్రోల్ రూమ్.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
మంత్రి అజహరుద్దీన్ నేతృత్వంలో తక్షణమే సౌదీకి అధికారుల బృందం
న్యూఢిల్లీ/సాక్షి, నెట్‌వర్క్/సాక్షి,న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా సందర్శించుకోవాలనే తమ చిరకాల వాంఛను తీర్చుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన 45 మంది ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో 43 మంది నగరానికే చెందిన వారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టగా మంటలు చెలరేగడంతో అంతా సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున మదీనాకు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయాన్నే అందిన పిడుగుపాటు లాంటి వార్త నగర వాసుల్ని కలచివేసింది.
ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి కుమారులు, కుమార్తెలు, వారి పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మొత్తం 46 మంది బస్సులో ప్రయాణిస్తుండగా ఒక్కరు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. మరణించిన నగర వాసుల్లో 18 మంది పురుషులు, 26 మంది మహిళలు కాగా వీరిలో 10 మంది చిన్నారులు ఉన్నారు. వీరి మృతదేహాలను జెడ్డాలోని కింగ్ ఫహద్, కింగ్ సల్మాన్, అల్ మిఖత్ ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జెడ్డాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మృతదేహాలను మదీనాలోనే స్థానిక సంప్రదాయాల మేరకు ఖననం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల వద్ద జరిగిన రెండు ఘోర బస్సు ప్రమాదాలను మరిచిపోక ముందే మరో దుర్ఘటన జరగడం, ఏకంగా 44 మంది హైదరాబాదీలు మరణించడం నగరాన్ని కుదిపేసింది.
మొత్తం 54 మంది యాత్రికులు
ఉమ్రా యాత్ర కోసం నగరంలోని వివిధ ట్రావెల్ ఏజెన్సీల నుంచి మొత్తం 54 మంది ఈ నెల 9న బయలుదేరి వెళ్లారు. మక్కా సందర్శన అనంతరం నలుగురు అక్కడే ఆగిపోగా.. మరో నలుగురు కారులో మదీనాకు వెళ్లారు. మిగిలిన 46 మందీ బస్సులో మదీనా వెళ్తుండగా గమ్య స్థానానికి 25 కి.మీ దూరంలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 1:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బస్సు రోడ్డు పక్కన ఆగి ఉండగా, ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. అయితే ప్రమాదానికి కారణాలను సౌదీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
జెడ్డాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు త్రెలిపారు. 8002440003 (టోల్ ఫ్రీ), 00966122614093, 00966126614276 00966556122301 (వాట్సాప్) హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జెడ్డా నుంచి అధికారుల బృందం ఘటనా స్థలికి, ఆస్పత్రులకు వెళ్లినట్లు అక్కడి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
రియాద్‌లోని ఎంబసీ కార్యాలయం కూడా సౌదీ అధికారులతో కలిసి పని చేస్తోంది. సౌదీ ప్రమాదం నేపథ్యంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. (కాంటాక్ట్ నంబర్లు.. వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ –+91 98719 99044, సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – +91 99583 22143, రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ –+91 96437 23157). ఇలావుండగా షెడ్యూల్ ప్రకారం యాత్రికుల బృందం ఈనెల 23న జెడ్డా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాల్సి ఉంది. ఈ మేరకు వీరికి విమాన టిక్కెట్లు సైతం బుక్ అయ్యాయి.
ప్రధాని మోదీ సంతాపం
ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘నేను తీవ్ర విచారంలో మునిగిపోయా. నా ఆలోచనలన్నీ ఆప్తుల్ని కోల్పోయిన వారి చుట్టూనే ఉన్నాయి. జెడ్డాలోని మన కాన్సులేట్, రియాద్‌లోని ఎంబసీ అవసరమైన సహాయ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాయి. ఇక్కడి మన అధికారులు కూడా సౌదీ అధికారులతో కలిసి పని చేస్తున్నారు..’ అంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రష్యా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి జైశంకర్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
సౌదీ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఢిల్లీలోని అధికారులు, సౌదీలోని రాయబారితోనూ మాట్లాడాలని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయకచర్యలు తీసుకోవాలని సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిని ఆదేశించారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ శాఖ అధికారితో కూడిన ప్రతినిధి బృందం తక్షణమే సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లనుంది. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి సూచనల మేరకు అన్ని రకాలుగా అదుకుంటామని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చెప్పాట్టాలని సౌదీ అధికారులను కోరినట్లు మంత్రి అజారుద్దీన్ తెలిపారు. మృతులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని, వారి కుటుంబాల నుంచి ఇద్దరిని అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎస్ ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌తో మాట్లాడి తగు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో మృతుల కుటుంబసభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు వీలుగా 79979 59754, 99129 19545 టోల్ ఫ్రీ నంబర్లతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రమాదానికి సంబంధించిన సహాయ సహకారాల కోసం పోలీసు విభాగం తరఫున సంయుక్త పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్ పని చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
ఎప్పుడూ ప్రమాదకరమే..
సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలాల నుంచి యాత్రికుల తరలింపు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా హజ్ యాత్ర సమయంలో రోడ్లన్నీ బస్సులతో కిటకిటలాడుతుంటాయి. ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా ఉంటాయి. 2023లో మక్కా నుంచి వెళ్తున్న ఓ బస్సును బ్రిడ్జిని ఢీకొట్టి మంటల్లో చిక్కుకోవడంతో 20 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 25 మంది గాయపడ్డారు. 2019లో ఓ బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో 35 మంది చనిపోయారు.
సౌదీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
సాక్షి, అమరావతి: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు మరణించడం విచారకరమన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
45 మంది మృతి బాధాకరం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది భారతీయులు దుర్మరణం చెందడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మృతిచెందిన వారిలో అత్యధిక మంది హైదరాబాద్‌కు చెందిన ముస్లిం యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. వారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని
పేర్కొన్నారు.
దిగ్భ్రాంతికి గురి చేసింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఉమ్రా యాత్రలో దుర్ఘటన దురదృష్టకరం
రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్
సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాద దుర్ఘటనపై రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని ప్రారి్థస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ సంతాపం
సౌదీ అరేబియా ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.
మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
అదేవిధంగా సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 45 మంది మృతి చెందడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.


