ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు

Qatar court reduces punishment for 8 ex-Indian Navy veterans on death row - Sakshi

కేవలం జైలు శిక్షగా మారుస్తూ ఖతార్‌ అప్పిలేట్‌ కోర్టు తీర్పు 

భారత్‌కు అతిపెద్ద దౌత్య విజయం

న్యూఢిల్లీ: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్ష పడిన 8 మంది భారత నావికాదళం మాజీ అధికారులకు భారీ ఊరట లభించింది. వారికి విధించిన మరణ శిక్షను ఖతార్‌ అప్పిలేట్‌ కోర్టు రద్దు చేసింది. ఈ శిక్షను కేవలం జైలు శిక్షగా మారుస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. అయితే, వారు ఎంతకాలం జైలులో శిక్ష అనుభవించాలన్నది తెలియరాలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అల్‌–దాహ్రా గ్లోబల్‌ టెక్నాలజీస్‌ కేసులో ఖతార్‌ కోర్టు 8 మందికి శిక్షను తగ్గించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. గూఢచర్యం కేసులో 8 మంది నేవీ మాజీ అధికారులు 2022 ఆగస్టులో ఖతార్‌లో అరెస్టయ్యారు. అప్పిలేట్‌ కోర్టు తాజా తీర్పును భారత దౌత్య విజయంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్‌–28 సదస్సు సందర్భంగా ఇటీవల దుబాయ్‌లో ఖతార్‌ పాలకుడు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌–థానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఖతార్‌లో 8 మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష గురించి ఈ భేటీలో మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. శిక్ష నుంచి వారికి విముక్తి కలి్పంచాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తి పట్ల ఖతార్‌ పాలకులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమంపై అల్‌–థానీతో చర్చించినట్లు ఈ భేటీ తర్వాత మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరణ శిక్షను రద్దు చేసి, జైలు శిక్షగా కుదిస్తూ ఖతార్‌ కోర్టు తీర్పు ప్రకటించింది.  

బాధితులకు అండగా ఉంటాం  
ఖతార్‌ కోర్టు తాజా తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. తదుపరి చర్యల విషయంలో న్యాయ నిపుణులతో, బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. కోర్టులో గురువారం జరిగిన విచారణకు ఖతార్‌లోని భారత రాయబారి, ఇతర అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారని తెలియజేసింది. బాధితులకు అండగా ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేసింది.

ఏమిటీ కేసు?  
8 మంది భారత మాజీ అధికారులు ఖతార్‌ రాజధాని దోహాకు చెందిన అల్‌–దాహ్రా గ్లోబల్‌ టెక్నాలజీస్‌ అనే ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నారు. ఈ సంస్థ ఖతార్‌ సైనిక దళాలకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇస్తోంది. ఇతర సేవలు అందిస్తోంది. అల్‌–దాహ్రా సంస్థలో పని చేస్తున్న 8 మంది భారతీయులను గత ఏడాది ఆగస్టులో ఖతార్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశ రహస్యాలను చోరీ చేస్తున్నట్లు వారిపై అభియోగాలు మోపారు.

ఇతర దేశాలకు సమాచారం చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అయితే, ఈ అభియోగాలను బహిరంగపర్చలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్‌ కోర్టు 8 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచి్చంది. దీంతో భారత ప్రభుత్వం న్యాయ పోరాటం ప్రారంభించింది. శిక్షను వ్యతిరేకిస్తూ ఖతార్‌లోని కోర్టు ఆఫ్‌ అప్పీల్‌ను ఆశ్రయించింది. ఖతార్‌లో శిక్ష పడిన వారిలో నవతేజ్‌ గిల్, సౌరభ్‌ వశి‹Ù్ట, పూర్ణేందు తివారీ, అమిత్‌ నాగ్‌పాల్, ఎస్‌.కె.గుప్తా, బి.కె.వర్మ, సుగుణాకర్‌ పాకాల, సైలర్‌ రాగేశ్‌ ఉన్నారు. వీరిలో సుగుణాకర్‌ పాకాల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top