ఖతార్ సైనికస్థావరం నుంచి బయల్దేరిన సైనికులు
ఇరాన్‌లో మరింత ఉధృతమైన నిరసనలు
2,571కు పెరిగిన మరణాలు
ఆందోళనకారులపై ఖమేనీ ప్రభుత్వం కాస్తయినా దయ చూపాలి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన
దుబాయ్/వాషింగ్టన్/బ్యాంకాక్/న్యూఢిల్లీ: ఇరాన్‌తో వాణిజ్యంచేసే దేశాలపై పాతిక శాతం సుంకాలువేసి టారిఫ్‌ల కొరడా ఝళిపించిన ట్రంప్ సేన హఠాత్తుగా సుంకాల మాటెత్తకుండా సైన్యంతో దండెత్తబోతోందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరం నుంచి పెద్దసంఖ్యలో బలగాలు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు వార్తలొచ్చాయి.
అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేయొచ్చనే ముందస్తు అంచనాతోనే తమ సైన్యాన్ని స్థావరం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని, దాడి ఉద్దేశం తమకు లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఆందోళనకారులపై కాల్పులు జరిపితే కన్నెర్ర జేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా తమ స్థావరం మీదనే ఇరాన్ దాడులకు దుస్సాహసం చేస్తే చూస్తూ ఊరుకోబోడని, ఇరాన్ కంటే ముందే దాడులతో విరుచుకుపడతాడని అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ఇరాన్‌లో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తొలుత వందల్లో కన్పించిన మరణాలు ఇప్పుడు వేలల్లో తేలుతున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మొదలైన ఆందోళనల్లో, పోలీసులతో ఘర్షణల్లో ఇప్పటిదాకా 2,571 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 2,403 మంది ఉద్యమకారులు కాగా 147 మంది పోలీసులు ఉన్నారు. ఉద్యమంలో పాల్గొనని, అభంశుభం ఎరుగని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు సైతం ఈ ఘర్షణల్లో చనిపోయారని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘ ది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజె న్సీ’ బుధవారం ప్రకటించింది. ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచేస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా 18,100 మందిని నిర్బంధంలోకి తీసుకుంది.
దీటుగా బదులిస్తాం..
దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికాకు దీటుగా బదులిస్తామని ఖమేనీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖమేనీ సలహాదారు అలీ షామ్‌ఖానీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘గతంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేశామని ప్రగల్భాలు పలికే ట్రంప్.. మేం మీ అల్ ఉదేయిద్ స్థావరంపై క్షిపణులతో దాడి చేసి వినాశనం సృష్టించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?. ఆనాటి మా దాడి మా సంకల్పం, సామర్థ్యాలకు బలమైన నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
స్టార్‌లింక్ నుంచి ఉచిత ఇంటర్నెట్ సేవలు
ఉద్యమకారులపై పోలీస్‌ల దమనకాండతో రక్తసిక్తమవుతున్న ఇరాన్‌లో వాస్తవ పరిస్థితులు ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఎప్పటికప్పుడు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎలాన్ మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ సంస్థ ఉచితంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందిస్తోందని ఉద్యమకారులు బుధవారం వెల్లడించారు. అయితే ఈ వార్తలను స్టార్‌లింక్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ‘‘టెహ్రాన్ ఫోరెన్సిక్ వైద్య కేంద్రం వరండాలో వరసబెట్టి మృతదేహాలు పడి ఉన్నాయి. ఇలాంటి దారుణోదంతాలను బయటి ప్రపంచానికి తెలియజేయాలంటే కనీసం ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. ఈ విషయంలో స్టార్‌లింక్ పాత్ర కీలకం’’ అని ఇరాన్‌లోని మెహ్‌దీ యాహ్యానిజాద్ అన్నారు.
ఇరాన్‌ను వీడాలన్న భారత్
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇరాన్‌లోని తమ పౌరులు, భారతీయు లు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమస్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదావేసుకోవాలని భారత్‌లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది.


