
అమెరికా నుంచి 160 విమానాల కొనుగోలుకు ఖతార్ సంసిద్ధత
ఖతార్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
దోహా/రియాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబి యా పర్యటన ముగించుకొని బుధవారం ఖతార్ చేరుకున్నారు. ఖతార్‌లో ఆయన ఘన స్వాగతం లభించింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 160 విమానాలు కొనుగోలు చేసేందుకు ఖతార్ ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ డీల్ విలువ 200 బిలియన్ డాలర్లు అని తెలిపారు. ఖతార్ పాలకుడు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్–థానీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
ఈ పర్యటన కంటే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ఖతార్ నుంచి ఒక విమానాన్ని బహుమతిగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఖతార్ ఇచ్చే విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్‌గా వాడుకుంటానని వ్యాఖ్యానించారు. మరోవైపు తుర్కియేలో పర్యటించాలన్న ఆకాంక్షను ట్రంప్ వ్యక్తంచేశారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలు జెలెన్‌స్కీ, పుతిన్ తుర్కియేలో ముఖాముఖి భేటీ కాబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ పట్ల ట్రంప్ ఆసక్తి కనబరుస్తున్నారు. తాను తుర్కియేకు వెళ్తే పుతిన్ ఎంతగానో సంతోషిస్తారని ట్రంప్ చెప్పారు.
ఒకప్పుడు ఉగ్రవాదుల జాబితాలో ఉన్న సిరియా అధ్యక్షుడితో ట్రంప్ సమావేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సౌదీ అరేబియాలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్– షారాతో సమావేశమయ్యారు. రెండు దేశాల అధినేతలు కలుసుకోవడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి. 50 ఏళ్లుగా అస్సద్ కుటుంబ పాలనలో అంతర్యుద్ధంతో నలిగిపోయి న సిరియాకు ఇటీవలే విముక్తి లభించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌తో అల్–షారా కీలక అంశాలపై చర్చించినట్లు తెలు స్తోంది. ఇజ్రాయెల్ దేశాన్ని అధికారికంగా గుర్తించాలని, సిరియా నుంచి విదేశీ ఉగ్రవాదులను బయటకు వెళ్లగొట్టాలని అల్–షారాను ట్రంప్ కోరినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు.
అల్– షారాతో భేటీ అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సిరియా అధ్యక్షు డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఆకర్ష ణీయంగా కనిపిస్తున్న అందమైన యువకుడు అంటూ కొనియాడారు. బలమైన వ్యక్తి, ఫైటర్ అంటూ శ్లాఘించారు. సిరియాపై ఆంక్షలు రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిరియా ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ కు మంచి రోజులు వచ్చా యని ఆనందం వ్యక్తంచేశారు. అస్సద్ ప్రభుత్వ హయాంలో తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు పొందిన అల్–షారాను అమెరికా ప్రభుత్వం 2013లో అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఆయనపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. అదే అల్–షారా అధ్యక్షుడు కావడం, డొనల్డ్ ట్రంప్ ఆయనతో భేటీ కావడం విశేషం.