‘మేడ్ ఇన్ ఇండియా’నిఘా నౌకను అందజేసిన ప్రధాని మోదీ
అంబులెన్స్‌లు, యుటిలిటీ వాహనాలు, లేజర్ రేడియల్ బోట్లు సైతం
ప్రధానమంత్రికి సెషెల్స్‌లో ఘన స్వాగతం
విక్టోరియా: ద్వీప దేశమైన సెషెల్స్ సముద్ర భద్రతా సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారత్ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన శనివారం సెషెల్స్ దేశానికి చేరుకున్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’నిఘా నౌకను సీషెల్స్ కోస్ట్‌గార్డుకు లాంఛనంగా అందజేశారు. రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో భారత్–సెషెల్స్ మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు.
భారత్‌లో తయారైన నిఘా నౌకను సెషెల్స్‌కు అందజేయడం ఇరుదేశాల మధ్య సంబంధాల్లోమరో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోందని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అలాగే ఆరు అంబులెన్స్‌లు, పది యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ బోట్లను కూడా సెషెల్స్‌కు అందజేశారు. అంతకుముందు భారత్ నుంచి సెషెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ ఘన స్వాగతం పలికారు.
మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. కళాకారులు నాట్య ప్రదర్శనలతో మోదీని స్వాగతించారు. మోదీ కోసం సెషెల్స్‌లోని భారతీయులు తరలివచ్చారు. వారితో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. భారతదేశం పట్ల వారికున్న ప్రగాఢమైన అభిమానం, సెషెల్స్ పురోగతికి వారు అందిస్తున్న నిరంతర సహకారం నిజంగా ప్రశంసనీయమని పేర్కొ న్నారు.
భారతీయ ప్రవాసులు చాలాకాలంగా మన రెండు దేశాల మధ్య ఒక శక్తివంతమైన వారధిగా పనిచేస్తూ, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ, మన ఉమ్మడి ప్రయాణాన్ని సుసంపన్నం చేస్తున్నారని కొనియాడారు. ఈ పర్యటనలో భాగంగా ప్యాట్రిక్ హెర్మినీతో మోదీ సమావేశం కాబోతున్నారు. ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ చర్చిస్తారు.
సెషెల్స్ నేషనల్ డే స్వర్ణోత్సవాలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. హిందూ మహాసముద్రంలో సెషెల్స్ ఒక విలువైన సముద్ర భాగస్వామి, సన్నిహిత మిత్రదేశమని మోదీ వివరించారు. రెండు దేశాల ప్రజలకు లబ్ధి చేకూరేలా సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
కూర్మ రాజును సందర్శించిన మోదీ
ప్రధాని మోదీ శనివారం అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో కలిసి సెషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్‌లోని భారీ తాబేళ్ల ఆవరణను సందర్శించారు. ఇక్కడ అల్డాబ్రా వృద్ధ తాబేలుకు ఆహారం తినిపించారు. సీషెల్స్‌కు చెందిన అల్దాబ్రా భారీ తాబేళ్లు భూమిపై అత్యంత పెద్దవి, అత్యధిక కాలం జీవించే జీవజాతుల్లో ఒకటి. వీటిలో కొన్ని తాబేళ్లు రెండు శతాబ్దాలకు పైగా చరిత్రకు సాక్షిగా నిలిచాయి. ‘‘అల్డాబ్రా తాబేళ్లకు భారత్, సీషెల్స్ మధ్యనున్న ప్రత్యేక స్నేహంతో అనుబంధం ఉంది. 2014లో రెండు తాబేళ్లను కోల్‌కతాలోని అలీపూర్ జంతు పదర్శన శాలకు బహుమతిగా ఇచ్చారు.
ఆ తర్వాత కొన్నేళ్లకు సెషెల్స్ మరికొన్ని తాబేళ్లను హైదరాబాద్ జూకు బహుమతిగా అందించింది’’అని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల రెండు దేశాలకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను చాటిచెబుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సెషెల్స్‌కు మాత్రమే ప్రత్యేకమైన ‘కోకో డి మెర్’అనే మొక్కను మోదీ నాటారు. కోకో డి మెర్‌కు సీషెల్స్‌లో విస్తృతమైన గౌరవం ఉందని, అది ఆ దేశ జాతీయ చిహ్నంపై కూడా ఉంటుందని మోదీ వివరించారు. అత్యంత పెద్ద విత్తనాలు, అత్యంత బరువైన పండ్లను ఉత్పత్తి చేయడంలో ఈ జాతి ప్రసిద్ధి చెందిందని తెలిపారు.


