
‘సిందూర్’ కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదు
భారత దాడుల్లో భారీ నష్టం జరగడంతో పాకిస్తాన్‌కు తత్వం బోధపడింది
అయినా పాకిస్తాన్‌దే విజయమని షెహబాజ్ షరీఫ్ చెప్పుకుంటున్నారు
ధ్వంసమైన రన్‌వేలు, కాలిపోయిన హ్యాంగర్లు విజయంగా కనిపిస్తున్నాయా?
ఉగ్రవాద కేంద్రాలను మూసివేసి, ముష్కరులను అప్పగిస్తేనే పాక్‌తో చర్చలు
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ వాదనను తిప్పికొట్టిన భారత్
ఐక్యరాజ్యసమితి: ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్లనే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించిందంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను అదే వేదిక నుంచి భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ సైన్యం కాళ్లబేరానికి వచ్చి ప్రాధేయపడడం వల్లే దాడులు ఆపేశాం తప్ప ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పింది.
భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక వ్యవహారాల్లో మూడోపక్షం జోక్యాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి పెటల్ గహ్లోత్ శుక్రవారం సాయంత్రం ఐరాస సాధారణ సభ(జనరల్ అసెంబ్లీ) సమావేశంలో ప్రసంగించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై నిప్పులు చెరిగారు. అర్థంపర్థంలేని అసంబద్ధమైన మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని గొప్పగా కీర్తించడం, ఆకాశానికి ఎత్తేయడం ఆయనకే చెల్లిందని ధ్వజమెత్తారు.
పాకిస్తాన్ విదేశాంగ విధానానికి ఉగ్రవాదమే మూలస్తంభంగా మారిందన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ కింద పడినా తనదే పైచేయి అని చెప్పుకోవడానికి ఆరాట పడుతోందని ఎద్దేవా చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిందని, పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలను, శిక్షణ కేంద్రాలను, ఎయిర్‌బేస్‌లను నేలమట్టం చేసిందని గుర్తుచేశారు. పెటల్ గహ్లోత్ ఇంకా ఏం మాట్లాడారంటే...
అందుకేనా మీ సంబరాలు?
‘‘ ఈ ఏడాది మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది. భారత్‌పై మరిన్ని దాడులు చేస్తామంటూ మే 9 దాకా పాకిస్తాన్ బెదిరింపులకు దిగింది. వెంటనే దాడులు ఆపాలంటూ మే 10న భారత్‌ను పాక్ సైన్యం వేడుకుంది. మూడో వ్యక్తితో సంబంధం లేకుండా నేరుగా సంప్రదించింది. భారత సైన్యం చేపట్టిన వైమానిక దాడుల్లో భారీగా నష్టం వాటిల్లడంతో పాకిస్తాన్‌కు తత్వం బోధపడింది.
ఆపరేషన్ సిందూర్‌లో పాక్ కీలక వైమానిక కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఫొటోలు బయటకు వచ్చాయి. అవి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా చూడొచ్చు. భారత్‌పై జరిగిన యుద్ధంలో విజయం సాధించామని షెహబాజ్ షరీఫ్ చెప్పుకుంటున్నారు. పూర్తిగా ధ్వంసమైన రన్‌వేలు, మంటల్లో కాలిపోయిన హ్యాంగర్లు ఆయనకు విజయంగా కనిపిస్తున్నాయా?
ఉగ్రవాదులకు అధికారుల నివాళులా?
పాకిస్తాన్ భూభాగంలోని బహవల్పూర్, మురిద్కేలో ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలు నామరూపాల్లేకుండాపోయిన చిత్రాలు మనమంతా చూశాం. భారత సైన్యం దాడుల్లో కరడుగట్టిన ఉగ్రవాదులు హతమైపోయారు. వారి అంత్యక్రియలకు పాకిస్తాన్ సీనియర్ సైనికాధికారులు, ప్రభుత్వాధికారులు స్వయంగా హాజరయ్యారు. నివాళులరి్పంచారు. ముష్కరులను గొప్ప వ్యక్తులుగా పరిగణించడం పాకిస్తాన్ విధానమని మరోసారి తేలిపోయింది.
వారిని శిక్షించాల్సిందే
పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ను ఏప్రిల్ 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వెనకేసుకొచి్చంది పాకిస్తాన్ కాదా? పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ భద్రతా మండలి జారీ చేసిన ప్రెస్ స్టేట్‌మెంట్‌లో టీఆర్‌ఎఫ్ పేరును ఎవరు తొలగించారు? డ్రామాలు, అబద్ధాలు నిజాన్ని కప్పిపుచ్చలేవు. పహల్గాం దాడికి కారణమైన ముష్కరులను, వారి పోషకులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల్సిందే.
ఉడత ఊపులకు భారత్ భయపడదు
ఉగ్రవాదంపై భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. ఉగ్రవాదులను, వారి పోషకులను వేర్వేరుగా చూడడం లేదు. భారత్ దృష్టిలో వారంతా ఒక్కటే. వారిని శిక్షించాల్సిందే. అణుబాంబులు ఉన్నాయని బెదిరిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తామంటే సహించే ప్రసక్తే లేదు. అలాంటి ఉడత ఊపులకు భారత్ ఎప్పటికీ భయపడదు. ఎవరికీ తలవంచదు. భారత్‌తో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నామని షెహబాజ్ షరీఫ్ చెబుతున్నారు.
చర్చలు జరగాలని ఆయన నిజాయితీగా కోరుకుంటే ‘తొలుత పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద కేంద్రాలన్నింటినీ మూసివేసి ఉగ్రవాదులను మాకు అప్పగించాలి. ఆ తర్వాతే చర్చలు. మతోన్మాదం, విద్వేషం, అసహనం అనే రొచ్చులో చిక్కుకున్న పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి వేదికపై విశ్వాసం, శాంతి గురించి బోధనలు చేయడం విచిత్రంగా ఉంది’’ అని పెటల్ గహ్లోత్ ఘాటుగా వ్యాఖ్యానించారు.