
మానవతా సహాయాన్ని పెంచేందుకేనన్న ఇజ్రాయెల్
ఇకపై తమను నిందించొద్దన్న ప్రధాని నెతన్యాçహూ
డెయిర్ అల్–బలాహ్/జెరూసలేం: పాలస్తీనా భూభాగంలో ఆకలి మరణాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యూహాత్మక విరామం ప్రకటించింది. గాజా నగరం, డెయిర్ అల్ బలాహ్, మువాసీ నగరాల్లో రోజుకు పది గంటలు పాటు కాల్పుల విరామం ఉంటుందని తెలిపింది. తదుపరి నోటీసు వచ్చే వరకు స్థానిక సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సైనిక కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
గాజా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆహారం, మందులు పంపిణీ చేసే కాన్వాయ్‌ల కోసం సురక్షిత మార్గాలు తెరిచి ఉంటాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ ప్రకటన గాజా వాసులకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఈ సహాయ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ జాతీయ రక్షణ మంత్రి ఇటమర్ బెన్–గ్విర్ విమర్శించారు. ఇది తన ప్రమేయం లేకుండానే జరిగిందన్నారు. హమాస్ మోసపూరిత ప్రచారానికి లొంగిపోవడంగా అభివర్ణించారు. గాజాకు అన్ని రకాల సహాయాన్ని నిలిపివేయాలని, భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు.
ఆదివారం నుంచే అందిన ఆహారం..
వ్యూహాత్మక కాల్పుల విరమణతో.. ఆదివారం జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విమానాలు పారాచూట్ల ద్వారా 25 టన్నుల సహాయాన్ని గాజా ఎన్‌క్లేవ్‌లో జారవిడిచాయి. జికిమ్ సరిహద్దు క్రాసింగ్ నుంచి ఆదివారం సహాయ ట్రక్కులు ఉత్తర గాజాలోకి ప్రవేశించాయి. ఆదివారం కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా దక్షిణ గాజాకు 1,200 మెట్రిక్ టన్నులకు పైగా ఆహారాన్ని పంపినట్లు ఈజిప్టు రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఇజ్రాయెల్–పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య దోహాలో జరిగిన కాల్పుల విరమణ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగియడం, గాజాలో మానవతా సంక్షోభం నెలకొనడంతో ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే.. ఆ దేశం వాటిని తిరస్కరిస్తూ వస్తోంది. తాజా వ్యూహాత్మక విరామం నేపథ్యంలో.. గాజాలో సంక్షోభానికి ఇక తమ ప్రభుత్వాన్ని నిందించడం మానేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాçహూ సూచించారు. ఇంతకుముందు కూడా సురక్షిత మార్గాలున్నా యని, ఇకనుంచి అధికారికంగా ఉంటాయని ఆయన తెలిపారు.
పోషకాహార లోపంతో
ఆరుగురు మృతిగాజాలో పోషకాహార లోపంతో గత 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయా రు. దీంతో ఆకలితో మరణించిన వారి సంఖ్య 133కి చేరుకుంది. వీరిలో 87 మంది పసి పిల్లలు ఉండటం గమనార్హం. మరోవైపు, ఆదివారం సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇజ్రా యెల్ జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించారని, 50 మంది గాయపడ్డారని సెంట్రల్ గాజాలోని అల్–అవ్దా, అల్–అక్సా ఆసుపత్రుల అధికారులు తెలిపారు. ఈ దాడులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఇజ్రాయెల్ సైన్యం.. ఆదివారం గాజాలో తమ సైనికులు ఇద్దరు మరణించారని ప్రకటించింది.