
లాహోర్: పాకిస్తాన్‌లో 17 ఏళ్ల జైన్ అలీకి న్యాయస్థానం 100 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా రూ.12.61 లక్షల జరిమానా కూడా విధించింది. జైన్ అలీ తన సొంత తల్లి(45), సోదరుడు తైమూర్(20), ఇద్దరు సోదరీమణులు మహ్‌నూర్(15), జన్నత్(10)ను దారుణంగా హత్య చేశాడు. 2022లో లాహోర్‌లో ఈ ఘటన జరిగింది.
ఆన్‌లైన్ పబ్‌జీ గేమ్ ఆడొద్దంటూ కుటుంబ సభ్యులు వారించడంతో జైన్ అలీ ఆగ్రహం పట్టలేక వారిని పొట్టనపెట్టుకున్నాడు. ఇంట్లో ఉన్న పిస్తోల్‌తో నలుగురిని కాల్చి చంపాడు. అప్పట్లో అతడి వయసు 14 ఏళ్లు మాత్రమే. హత్య తర్వాత పిస్తోల్ మురికికాలువలో పడేశాడు. ఈ హత్యాకాండ పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జైన్ అలీ ఈ హత్య చేసినట్లు నిరూపణ అయ్యింది. అతడు నేరం అంగీకరించాడు. దాంతో లాహోర్ అదనపు సెషన్స్ జడ్జి రియాజ్ అహ్మద్ శిక్ష ఖరారుచేశారు. నాలుగు హత్యలకు గాను ఒక్కో హత్యకు 25 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నాలుగు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయన్నారు. అతడి వయసును దృష్టిలో పెట్టుకొని మరణ శిక్ష విధించడం లేదని వివరించారు.