
భారత్‌తో చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఆయా అంశాలపై చర్చలకు ఇస్లామాబాద్ సిద్ధమంటూ పునరుద్ఘాటించారు. దీనిపై భారత్ తుది నిర్ణయం తీసుకోవాలన్న దార్.. ఆ దేశ అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు బంతి.. భారతదేశ కోర్టులో ఉందంటూ దార్ వ్యాఖ్యానించారు.
వాణిజ్యం నుంచి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి వివిధ అంశాలపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘అర్థవంతమైన చర్చలు’ అవసరమంటూ ఆయన నొక్కి చెప్పారు. కాశ్మీర్, భద్రత, ఆర్థిక సంబంధాలతో సహా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి చర్చలు తిరిగి ప్రారంభించాలని దార్ పిలుపునిచ్చారు.
కాగా, పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ కఠిన వైఖరి అవలంబించిన సంగతి తెలిసిందే. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు ఆ దేశంతో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను కట్ చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌తో పాటు పీవోకేలో ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్ మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు మే 10వ తేదీన ఒక అంగీకారానికి రావడం తెలిసిందే.