
ఖైబర్ పఖ్తుంఖ్వా: పాకిస్తాన్‌లో చోటుచేసుకున్న వైమానిక దాడులు అలజడులను సృష్టించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన విధ్వంసకర వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా వర్గాలు ధృవీకరించాయి. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు, మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
ఖైబర్ జిల్లాలోని తిరాను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు నివాస ప్రాంతంలో బాంబులు వేసి, నిద్రపోతున్న వారిని పొట్టనపెట్టుకున్నాయి. దాడులలో గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు అధికసంఖ్యలో ఉన్నారు. అందుబాటులో ఉన్న ఆస్పత్రులలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. కాగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఈ బాంబు దాడులపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.