మలేషియాలో పాకిస్తాన్ కు ఘోర అవమానం.. బకాయిలు చెల్లించకపోవడంతో విమానం సీజ్

Pakistan Airlines Flight Seized in Malaysia for Unpaid Dues - Sakshi

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA )కు చెందిన విమానాన్ని మలేషియాలోని కౌలాలంపూర్లో సీజ్ చేశారు. ఎయిర్ క్యాప్ అనే లీజింగ్ సంస్థకు చాలాకాలంగా బకాయిలు చెల్లించని కారణంగా పాకిస్తాన్ విమానం బోయింగ్ కో. 777 విమానాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు మలేషియా అధికారులు. 

బాకీ తీర్చమంటే... 
ఎయిర్ క్యాప్ సంస్థకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA )  సుమారుగా 4 మిలియన్ల డాలర్లు(రూ. 33 కోట్లు) బకాయి పడింది. ఈ సంస్థ అనేకమార్లు బకాయిల గురించి వివరణ కోరుతూ సందేశాలు పంపినా కూడా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఇదే విషయాన్ని మలేషియా కోర్టుకు విన్నవించగా బోయింగ్ కో. 777 విమానాన్ని వెంటనే సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. ఈ విమానం మంగళవారం కౌలాలంపూర్ విమానాశ్రయం చేరుకున్నట్లు సమాచారం అందుకోగానే అక్కడి కస్టమ్స్ అధికారులు నిర్దాక్షిణ్యంగా విమానంలో నిండుగా ప్రయాణికులు ఉండగానే విమానం సీజ్ ప్రక్రియను చేపట్టారు. 

ఇదే విమానం రెండోసారి... 
ఇదే తరహాలో 2021లో కూడా కౌలాలంపూర్ ఏవియేషన్ శాఖ ఇదే కారణంతో ఇదే విమానాన్ని మొదటిసారి సీజ్ చేయగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్  సంస్థ బకాయిల చెల్లింపుపై హామీ ఇవ్వడంతో 173 ప్రయాణికులతో ఉన్న ఈ విమానాన్ని జనవరి 27న తిరిగి పంపించడానికి అంగీకరించారు కౌలాలంపూర్ ఏవియేషన్ అధికారులు. తాజాగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ నుండి జవాబు లేకపోవడంతో సదరు లీజింగ్ సంస్థ కోర్టును ఆశ్రయించి మరోసారి సీజ్ ఆర్డర్స్ తెచ్చుకుని విమానాన్ని సీజ్ చేయించింది.    

మొత్తం చెల్లించేసాం... 
మళ్ళీ అదే కథ పునరావృతం కావడంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన అధికారి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ స్పందిస్తూ మా విమానం ఆగ్నేయ దేశాల్లో సీజ్ కావడం ఇది రెండోసారి. మేము చెల్లించాల్సిన బకాయిలను మేము గతంలోనే చెల్లించేసాం, అయినా కూడా వారు ఇలా చేయడం సరికాదని అన్నారు. దీనికి బదులుగా ఎయిర్ క్యాప్ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయని దానికి తోడు వివరణ కోరుతూ అనేక సందేశాలు పంపించినా కూడా వారినుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు.  

గతకొంత కాలంగా పాకిస్తాన్ దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుండి తేరుకుంటోన్న పాకిస్తాన్ పై మలేషియా కోర్టు కఠినంగా వ్యవహరించడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయ్యింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top