డాక్టర్‌ రోబో.. ఫైవ్‌ ఇన్‌ వన్‌! | NTU Singapore scientists develop 5-in-1 seed-sized surgical robot | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రోబో.. ఫైవ్‌ ఇన్‌ వన్‌!

Jun 11 2026 1:05 AM | Updated on Jun 11 2026 1:05 AM

NTU Singapore scientists develop 5-in-1 seed-sized surgical robot

కాలం మారిపోతోంది. ఒకప్పుడు కత్తులతో శరీరాన్ని కోసి చేసిన శస్త్రచికిత్సలు ఇప్పుడు చిన్న కోతలతో పూర్తవుతున్నాయి. మెరుగైన ఫలితాలిస్తున్నాయి. రోగులకు ఆ చిన్న కోతల బాధ కూడా లేకుండా చేసేందుకు సింగపూర్‌లోని నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ(ఎన్‌టీయూ) శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన రోబోను ఆవిష్కరించారు. శనగ గింజంత సైజుండే ఈ బుల్లి రోబో చేసే అద్భుతాలు అన్ని ఇన్నీ కావు..  

పక్క ఫొటో చూశారా? అందులో శాస్త్రవేత్త చేతిలో కనిపిస్తున్న నల్లటి వస్తువే మన బుల్లి రోబో. దీని పొడవు 4.4 మిల్లీమీటర్లు. వైర్లూ, ఎల్రక్టానిక్స్, బ్యాటరీల్లాంటివి ఏవీ దీంట్లో ఉండవు. అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు శస్త్రచికిత్సలు చేసేస్తుంది. కణజాలాన్ని కోయడంతోపాటు శరీరంలో అవసరమైన చోటికి మందులు తీసుకెళ్లి వదిలిపెడుతుంది. కణజాలం లోపలి నుంచి సులభంగా ప్రయాణించగలదు. 

కేన్సర్‌ వంటి వ్యాధులకు సంబంధించి బయాప్సీ చేయాలనుకోండి.. ఈ రోబోను వదిలితే చాలు.. ఎంచక్కా కావాల్సిన కణజాలాన్ని కత్తిరించి పట్టుకొచ్చేస్తుంది. అవసరమైనప్పుడు శరీరం లోపల వేడి పుట్టించి కొన్ని రకాల చికిత్సలకు సాయంగా నిలుస్తుంది కూడా. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సెకన్‌ కాలంలో ఒక పని నుంచి ఇంకోరకమైన పనికి మారగలగడం దీని ప్రత్యేకత. 

అయస్కాంత శక్తి మహిమ 
వైర్లూ, బ్యాటరీల్లాంటివి లేకుండానే ఈ రోబో కేవలం అయస్కాంత శక్తితో పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో ఈ ‘మ్యాగ్నెటిక్‌ మెడికల్‌ రోబోటిక్స్‌’కు ప్రాచుర్యం పెరుగుతోంది. రోబో శరీరం లోపల ఉంటే బయటి నుంచి వైద్యులు అయస్కాంతాల సాయంతో వాటిని కదలిస్తారు. ఇతర పనులు చేయిస్తారన్నమాట. అతి తక్కువ గాట్లూ, కోతలతో శస్త్రచికిత్సలను నిర్వహించేందుకు ఈ రకమైన రోబోలు బాగా ఉపయోగపడతాయని అంచనా.

 వీటితో సంప్రదాయ పద్ధతుల్లో చేరుకోలేని శరీరం లోపలి భాగాల్లోనూ సర్జరీలు చేయడం సులువు అవుతుంది. ఈ రకమైన రోబోలు ఇప్పటివరకూ ఏదో ఒక పని మాత్రమే చేయగలిగేవి. మందులు తీసుకెళ్లేందుకు ఒకటి.. కత్తిరించేందుకు ఒకటి ఇలా.. దేనికదే అన్నమాట. అయస్కాంత క్షేత్ర ప్రభావం రోబో మొత్తమ్మీద ఒకేరకంగా పడుతూండటం వల్ల ఒక రోబోతో వేర్వేరు పనులు చేయించలేకపోయే వారు. ఎన్‌టీయూ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ పరిమితిని అధిగమించగలిగారు. 

ఏడేళ్ల పరిశోధనలు
రోబోతో ఐదు రకాల పనులు చేయించేందుకు ఎన్‌టీయూ శాస్త్రవేత్తలు ఏడేళ్లుగా కృషి చేస్తున్నారు. వేర్వేరు కోణాల్లోంచి రోబోను అయస్కాంతీకరించడం, సాధారణ స్థితికి తీసుకురావడం ద్వారా గత అవరోధాలను విజయవంతంగా అధిగమించామని శాస్త్రవేత్త లుమ్‌ గుయో ఝాన్‌ తెలిపారు. ఒక్కో కోణంలో ఈ మార్పులు చేయడం ద్వారా ఒక్కో రకమైన పని చేయించేలా తాము రోబోలో ఒక మాగ్నెటిక్‌ రీప్రోగ్రామబుల్‌ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 

ఈ బుల్లి రోబోలోని వేర్వేరు ప్రాంతాలు అయస్కాంతానికి భిన్న రీతుల్లో స్పందించేలా చేశామని, అయస్కాంత క్షేత్ర ప్రభావం ఈ ప్రాంతాలపై వేర్వేరుగా ఉంటుందని లుమ్‌ గుయో వివరించారు. సాఫ్ట్‌ రోబోటిక్స్‌లో విరివిగా వాడే పీడీఎంఎస్, ఎకోఫ్లెక్స్‌ వంటి పదార్థాలతో ఈ రోబోను తయారుచేశారు. పీడీఎంఎస్, ఎకోఫ్లెక్స్‌ అనేవి సిలికోన్‌ ఆధారిత పదార్థాలు. ఈ పదార్థంలోనే అక్కడక్కడ ఐదు మైక్రోమీటర్ల సైజున్న అయస్కాంత కణాలను ఏర్పాటు చేశారు. ఈ కణాల అమరిక, అయస్కాంతీకరణల ఆధారంగా రోబో కదలిక, పనులు ఆధారపడి ఉంటాయి. 

ఫైవ్‌ ఇన్‌ వన్‌ ఎలాగంటే...  
బయాప్సీ కోసం ఇందులో చిన్న బ్లేడ్‌ ఉంటుంది. రోబో గట్టిగా పట్టుకుంటే ఈ బ్లేడ్‌ కణజాలాన్ని కత్తిరించి తనలో దాచుకుంటుంది. బయటకు తీసుకొచి్చన తరువాత కణజాలాన్ని విశ్లేషించడం ద్వారా కేన్సర్‌ వంటి వ్యాధుల నిర్ధారణ జరుగుతుంది. మందులు పెట్టి రోబోను శరీరం లోపలికి పంపిస్తే ఆ రోబోనే ఔషధాన్ని శరీరంలోకి జొప్పిస్తుంది. ప్రత్యేకమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించడం ద్వారా దీన్ని వేడెక్కించవచ్చు. 

అల్సర్ల వంటి వాటిని మాడ్చి మాన్పేందుకు ఉపయోగించవచ్చు. కేన్సర్‌కూ ఈ హైపర్‌ థెర్మియా పద్దతిని వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కణజాలం మధ్య కదిలేందుకు ఈ రోబోకు దొర్లుకుంటూ వెళ్లే సామర్థ్యాన్ని కల్పించారు. దీంతో రోబో ఎటు కావాలంటే అటు వెళ్లిపోగలదు. కోడి లివర్‌లో, కృత్రిమ కణజాలం నమూనాల్లో ఈ రోబోను ఇప్పటికే పరిశీలించి సత్ఫలితాలు సాధించామని, మానవ చర్మకణాలతో ప్రయోగాలు జరిపి ఈ రోబో ద్వారా శరీరానికి హాని ఏదీ జరగదని నిర్ధారించుకున్నామని లుమ్‌ గుయో ఝాన్‌ తెలిపారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
Advertisement