గోర్ఖా: నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. చుమ్నుబ్రీ పరిధిలోని బుఢీగండకీ నది ఉధృతికి పైయూ, బగర్ గ్రామాల్లోని దాదాపు 35 ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నదిపై రాకపోకలకు ఆధారమైన మోటారు వంతెనలతో పాటు పలు వేలాడే (సస్పెన్షన్) వంతెనలు కూడా వరద తాకిడికి కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
చుమ్కే ఖోలా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహం ఆగిపోవడం, ఆపై ఒక్కసారిగా భారీగా నీరు పోటెత్తడంతో ఈ ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించినట్లు అధికారులు గుర్తించారు. దోభాన్, ఘట్టేఖోలా, జగత్, సల్లేరీ గ్రామాల్లోనూ వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఎస్ఎంఎస్ అలర్ట్‌లు పంపారు.
VIDEO | A debris-laden flash flood in a river has swept away more than 35 houses and bridges in Nepal’s Gorkha district on Sunday, authorities said, urging people living along the stream to move to higher ground. The flood in the Budhi Gandaki River swept away houses in Salleri, Paiyuka and the riverbed at Jagat, as well as a suspension bridge connecting the ward, Ram Kumar Gurung, ward chair of Chumnubri Rural Municipality-3, was quoted as saying by the Kathmandu Post. (Source: Third Party) (Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) October 11, 2026
బాధిత ప్రాంతాల్లో నేపాల్ సైన్యం, పోలీసులు, విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. జగత్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండటంతో సైనిక హెలికాప్టర్ ద్వారా ఆరుగురిని సురక్షితంగా ఎయిర్‌లిఫ్ట్ చేశారు. బాధితులకు తక్షణ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సహాయం కోసం 1115 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


