నాతో ఫొటో కోసం మెలోనీ అడుక్కున్నారు  | Meloni says Trump made up story that she begged him for photo at G7 | Sakshi
Sakshi News home page

నాతో ఫొటో కోసం మెలోనీ అడుక్కున్నారు 

Jun 20 2026 5:17 AM | Updated on Jun 20 2026 5:17 AM

Meloni says Trump made up story that she begged him for photo at G7

జీ7 సదస్సులో దయదలచి ఆమెతో ఫొటో దిగా..  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు  

తిప్పికొట్టిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ 

తాను, ఇటలీ ఏనాడూ యాచించబోమని స్పష్టీకరణ   

రోమ్‌: గొప్పలు చెప్పుకోవడంలో తనకు తానే సాటి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నిరూపించుకున్నారు. పలుమార్లు భంగపాటు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తనతో ఫొటో కోసం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ యాచించారని ఆయన శుక్రవారం ఉదయం ప్రసారమైన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఉక్రెయిన్‌ అంశంపై ప్రశ్నించగా, ట్రంప్‌ మాత్రం హఠాత్తుగా సందర్భం లేకుండా మెలోనీ ప్రస్తావన తీసుకొచ్చారు. తనతో ఫొటో కోసం ఆమె ‘అడుక్కున్నారని’చెప్పారు. నిజానికి ఆమెతో ఫోటో దిగడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని.. కానీ జాలిపడి అంగీకరించానని అన్నారు. చివరకు దయతలచి మెలోనీతో ఫొటో దిగినట్లుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్, మెలోనీ పలు సందర్భాల్లో పక్కపక్కనే కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఫొటో కోసం ఆమె ట్రంప్‌ను ప్రాధేయపడినట్లుగా ఎక్కడా కనిపించలేదు.  

అవి బుద్ధిలేని మాటలు  
ట్రంప్‌ వాచాలత్వం పట్ల జార్జియా మెలోనీ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. తాను గానీ, ఇటలీ గానీ ఏనాడూ ఒకరి ముందు చెయ్యి చాచబోమని తేల్చిచెప్పారు. ట్రంప్‌ మాటలు పూర్తిగా కల్పితమని కొట్టిపారేశారు. అయినా ఒక మిత్రదేశం గురించి ఆయన అలాంటివి ఎలా సృష్టించగలుగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో తక్షణమే స్పందించాల్సి ఉంటుంది కాబట్టి తాను స్పందిస్తున్నానని వివరించారు. ట్రంప్‌ నోటిదురుసు చూసి తాను దిగ్భ్రాంతి చెందానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. 

ఏదేమైనా ఆయన ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదని గుర్తుచేశారు. ‘‘పశ్చిమ దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ట్రంప్‌ అదే దృఢ సంకల్పాన్ని చూపకపోవడం సిగ్గుచేటు అని మాత్రమే నేను చెప్పగలను. ఒక్క విషయం మాత్రం ట్రంప్‌ గుర్తుంచుకోవాలి. నేను గానీ, ఇటలీ గానీ ఏనాడూ ఒకరి ముందు యాచించం’’అని మెలోనీ స్పష్టంచేశారు. మరోవైపు ట్రంప్‌ వ్యాఖ్యలను ఇటలీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు కూడా ఖండించారు. అవి బుద్ధిలేని మాటలు అంటూ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ అన్నారు. అంతేకాకుండా తన అమెరికా పర్యటనను రద్దుచేసుకున్నారు. అయితే, ట్రంప్‌ మాటల పట్ల జార్జియా మెలోనీ ప్రతిస్పందనపై అమెరికా ఇంకా బదులివ్వలేదు.  

అందుకేనా వ్యతిరేకత?  
అమెరికా, ఇటలీ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మెలోనీ ప్రయతి్నస్తున్నారు. అయితే, ఇటలీపై అమెరికా–ఇజ్రాయెల్‌ ప్రారంభించిన యుద్ధాన్ని తప్పుపట్టారు. ఇది చట్టవిరుద్ధమని తేల్చిచెప్పారు. అమెరికా చర్యను ఆక్షేపించారు. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికాకు సహకరించేందుకు నిరాకరించారు. దాంతో ఆమె పట్ల ట్రంప్‌ వ్యతిరేకత పెంచుకున్నట్లు 
కనిపిస్తోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement