పాత్రికేయుల ఎదుటే  పౌరునిపై పోలీసు కాల్పులు | Man shot at point blank range by a Kenya police officer | Sakshi
Sakshi News home page

పాత్రికేయుల ఎదుటే  పౌరునిపై పోలీసు కాల్పులు

Jun 19 2025 5:41 AM | Updated on Jun 19 2025 5:41 AM

Man shot at point blank range by a Kenya police officer

నైరోబీలో ఘటన

కెన్యాలో మితిమీరిన పోలీస్‌ జులుం

నైరోబీ: పోలీసుయంత్రాంగం కొన్ని దేశాల్లో కారాగారాలను నరకానికి నఖలుగా మార్చేస్తుంటే మరికొన్ని దేశాల్లో పోలీసులు యమునికి ప్రతిరూపాలు గా అవతరిస్తు న్నారు. కొట్టే అధికారం ఉందనే గర్వంతో లాఠీలతోపాటు తూటాలకూ పనిచెప్పిన ఓ పోలీసు ఉదంతం ఇప్పుడు కెన్యాలో వివాదమైంది. పాత్రికేయుల ఎదుటే ఒక పౌరునిపై పోలీస్‌ అధికారి అన్యాయంగా తుపాకీ గురిపెట్టిన కాల్చిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

మంగళవారం నైరోబీలోని అత్యంత రద్దీగా ఉన్న ఒక రహదారిలో నిరసన ర్యాలీ జరిగింది. జూన్‌ ఆరో తేదీన ఆల్బర్ట్‌ ఒజ్వాంగ్‌ అనే బ్లాగర్‌ను పోలీసులు లాకప్‌డెత్‌ చేశారు. పోలీసుపై తప్పుడు కథనం రాశాడని అరెస్ట్‌చేసి పట్టుకొచ్చి చితకబాదడంతో అతను లాకప్‌లో కన్నుమూశాడు. సంబంధిత పోలీసులను అరెస్ట్‌చేయాలంటూ బుధవారం నైరోబీలో నిరసనర్యాలీ జరిగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్‌చేశారు. 

అదేసమయానికి మాస్క్‌లను అమ్ముకునే 22 ఏళ్ల వీధి వ్యాపారి బొనిఫేస్‌ కరియుకీ అటుగా వచ్చాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఇద్దరు సాయుధ పోలీసులు హెచ్చరించారు. ఉద్యమకారులతో తనకేం సంబంధంలేదని వివరణ ఇచ్చేలోపే ఒక పోలీసు ఇతని తలకు తుపాకీ గురిపెట్టి కాల్చాడు. దీంతో రక్తమోడుతూ కరియుకీ కుప్పకూలాడు. జర్నలిస్టుల ఎదుటే ఈ దారుణం జరిగింది. అదృష్టవశాత్తు అతడికి వెంటనే శస్త్రచికిత్సచేసి బుల్లెట్‌ను తీసేయడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్సపొందుతున్నాడు. విషయం తెల్సి ఆందోళనకారులు మళ్లీ నిరసనచేపట్టారు. దీంతో చివరకు ఆ అధికారిని అరెస్ట్‌చేశామని పోలీస్‌విభాగం ఒక ప్రకటన విడుదలచేసింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement