పోలీసులే కొట్టి నా కుమారుడిని చంపేశారు! | Bandaru Manikanta Death: Mother Alleges Police Torture | Sakshi
Sakshi News home page

పోలీసులే కొట్టి నా కుమారుడిని చంపేశారు!

Aug 18 2026 5:05 AM | Updated on Aug 18 2026 5:05 AM

Bandaru Manikanta Death: Mother Alleges Police Torture

యువకుడి మృతదేహంతో నిరసన తెలుపుతున్న కుటుంబసభ్యులు, బంధువులు

‘మన్యం’జిల్లాకు చెందిన తల్లి ఆరోపణ

యువకుడిని అరెస్టు చేసిన సాలూరు పోలీసులు 

అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి చెందిన యువకుడు

న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువుల నిరసన

రామభద్రపురం/పార్వతీపురం రూరల్‌: తన కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అనురాధ ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొండకెంగువకి చెందిన తన కుమారుడు బండారు మణికంఠ(22)ను ఈ నెల 7న సాలూరు పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. తాను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కొడుకును చూపించాలని ప్రాథేయపడినా చూపించలేదని, విచారణలో మణికంఠపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో అతడి ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు.

అస్వస్థతకు గురైన అతడిని సాలూరు సీహెచ్‌సీకి తరలించి తమకు పోలీసులు సమాచారమిచ్చారని, తాము వెళ్లి చూడగా మణికంఠ స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో మంచం మీద పడి ఉన్నాడని వివరించారు. మెరుగైన వైద్యం కోసం సాలూరులో ఉన్న ఓ ప్రైవేటు అస్పత్రికి తరలించగా ఆరోగ్యం క్షీణించిందని, దీంతో విజయనగరం మెడికవర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మణికంఠ మృతి చెందాడని చెప్పారు. కాగా, పోలీసుల చిత్రహంసల వల్లే తన మణికంఠ మృతి చెందాడని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతడి తల్లి, బంధువులు కొండకెంగువ రోడ్డుపై మృతదేహంతో నిరసన తెలిపారు

అనారోగ్యంతోనే మృతి: ఎస్పీ
కాగా, పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే మణికంఠ మృతి చెందాడన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి స్పష్టం చేశారు.  మణికంఠకు జడ్జి రిమాండ్‌ విధించారని, దానికి తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించగా..అప్పటికే అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, దీంతో వైద్యుల సూచన మేరకు అతడు ‘రిమాండ్‌కు అనర్హుడు’అని నిర్థారించి, 41ఏ కింద నోటీసు జారీ చేసి అతడిని ఆయన సోదరుడికి అప్పగించామని చెప్పారు. 

జ్వరం తీవ్రం కావడంతో అదే రోజు అర్ధరాత్రి విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.మలేరియా, పచ్చకామెర్లు, మెదడువాపు లాంటి ఆరోగ్య సమస్యలతో ప్లేట్‌లెట్లు పడిపోయి, అవయవాలు విఫలమవడం వల్లే మణికంఠ మరణించాడని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement