ఆకాశంలో ఉండగా విమానానికి మంటలు! | American Airlines Makes Emergency Landing In Las Vegas, Flight Incident Video Viral | Sakshi
Sakshi News home page

ఆకాశంలో ఉండగా విమానానికి మంటలు!

Jun 26 2025 7:54 AM | Updated on Jun 26 2025 12:33 PM

Las Vegas American Airlines flight Incident Viral

ఆకాశంలో ఉండగా ఓ విమానానికి మంటలు అంటుకున్నాయి. ఆ టైంలో విమానంలో మొత్తం 159 మంది ఉన్నారు. అయితే పైలట్‌ చాకచక్యంతో వ్యహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే ఇంజిన్‌ నుంచి మంటలు బయటకు వచ్చాయి. ఇది గమనించిన పైలట్‌ అప్రమత్తం అయ్యారు. వెంటనే విమానాన్ని వెనక్కి తెచ్చి సేఫ్‌ ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. 

అక్కడి కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. లాస్‌వెగాస్‌ హ్యారీ రెయిడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 1665 విమానం(ఎయిర్‌బస్‌కు చెందిన A321)  టేకాఫ్‌ అయ్యింది. 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో అది బయల్దేరింది. నార్త్‌ కరోలీనా షార్లెట్‌లోని డగ్లస్‌ ఎయిర్‌పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది.

అయితే.. టేకాఫ్‌ అయ్యాక కాసేపటికి(8.20గం.కి టేకాఫ్‌ అయితే.. 8.30గం.) గాల్లో ఉండగా ఇంజిన్‌ కింది భాగం నుంచి మంటలు, పొగ కనిపించాయి. ఇది గమనించిన పైలట్‌ విమానాన్ని తిరిగి లాస్‌వెగాస్‌ ఎయిర్‌పోర్టులో సేఫ్‌ ల్యాండ్‌ చేశారు. అయితే.. 

విమానాన్ని పరిశీలించిన సిబ్బందికి ఎలాంటి సాంకేతిక లోపం.. మంటలు అంటుకున్న జాడ కనిపించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ విమానాన్ని రద్దు చేసి.. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానాలకు చేర్చారు. ఆకాశంలో విమానానికి మంటలు అంటుకున్న దృశ్యాన్ని కొందరు తమ ఫోన్లలో బంధించగా.. ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(FAA) దర్యాప్తు జరుపుతోంది. 

ఇటీవల భారత్‌లో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మంది(సిబ్బందితో కలిపి), జనావాసాలపై విమానం కూలి పేలిపోవడంతో మరో 34 మంది స్థానికులు మరణించారు. తాజాగా బ్రెజిల్‌లో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ గాల్లో ఉండగా పేలి 8 మంది అక్కడికక్కడే మరణించగా.. కిందకు దూకి మరో 13 మంది ప్రాణాలు రక్షించుకోగలిగారు. ఈ ఘోర ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి కూడా.

Advertisement
 
Advertisement
Advertisement