
భారత్‌నుద్దేశించి పాక్ ప్రధాని షరీఫ్ బెదిరింపులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందాల్సిన జలాల్లో భారత్‌ను ఒక్క నీటి చుక్క కూడా తీసుకోనివ్వబోమని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 22న కశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పలు చర్యలను ప్రకటించింది. ఇందులో 1960ల నాటి సింధూ జలాల ఒప్పందం(ఐడబ్ల్యూటీ)నుంచి వైదొలగడం కూడా ఉంది. తద్వారా సిందూ జలాలను దిగువకు విడుదల చేయకుండా ఆపేసింది. దీనిపై పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇది యుద్ధ నేరమే అవుతుందంటూ ప్రకటనలు కూడా చేసింది.
ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ప్రధాని షరీఫ్..‘మా శత్రు దేశానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. మా నీళ్లను ఆపుతామంటూ మీరు బెదిరిస్తున్నారు కదా. పాకిస్తాన్‌కు చెందాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా మిమ్మల్ని తీసుకోనివ్వం. ఇది గుర్తుపెట్టుకోండి’అంటూ వ్యాఖ్యానించారు. పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా సోమవారం ఇలాంటి ప్రేలాపనలే చేయడం గమనార్హం.