
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి(ఐరాస) సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది. ఇదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించనున్నారని పేర్కొంది.
భారత దిగుమతులపై ట్రంప్ పరస్పర సుంకాలు విధించడంతో భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ప్రధాని మోదీ యూఎన్‌జీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనుంది. సెప్టెంబర్ 23 నుండి 29 వరకు జరిగే ఈ సదస్సును సాంప్రదాయకంగా బ్రెజిల్ ప్రారంభించనుంది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ సెషన్ ఉంటుందని సమాచారం. భారత ప్రతినిధి సెప్టెంబర్ 26న ఉదయం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పీటీఐ పేర్కొంది. అదే రోజున ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు కూడా ప్రసంగించే అవకాశం ఉంది.
గత ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలోని వైట్ హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య చర్చలు నడుస్తున్న తరుణంలోనే ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకం విధించారు. దీంతో మొత్తం విధించిన సుంకం 50 శాతంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను అన్యాయమైనదిగా పేర్కొంది. కాగా సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలు దేశాధినేతలతో మోదీ భేటీ కానున్నారని తెలుస్తోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ , అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.