అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
న్యూయార్క్/వాషింగ్టన్: వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ తనకు ఆహ్వానం పంపారని గురువారం తన ఓవల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఆయన (మోదీ) నా మిత్రుడు. నాతో మాట్లాడినప్పుడు భారత్‌లో పర్యటించాలని కోరారు. అందుకే నేను వెళ్తున్నా. అక్కడ మోదీతో కలిసి నా పర్యటన గొప్పగా ఉండబోతోంది. ఆయన గొప్ప వ్యక్తి.
బహుషా వచ్చే ఏడాది నా పర్యటన ఉండవచ్చు’అని పేర్కొన్నారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సభ్యులుగా ఉన్న క్వాడ్ సమ్మిట్ త్వరలో భారత్‌లో జరుగనుంది. సదస్సు తేదీలను భారత్ ఇంకా ప్రకటించలేదు. 2024లో అమెరికాలోని డెలావేర్‌లో ఈ సదస్సు నిర్వహించారు. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేసిందని ట్రంప్ మరోసారి ప్రకటించారు. ‘ఇది గొప్ప విషయం.
మంచిగా జరుగుతోంది. అతను (ట్రంప్) ఆపేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును చాలావరకు ఆపేశారు’అని పేర్కొన్నారు. భారత్– పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్టు మరోసారి చెప్పుకున్నారు. ‘నేను ఆపిన 8 యుద్ధాల్లో ఐదారు వరకు టారిఫ్‌లు విధిస్తానని బెదిరించి ఆపినవే. అందుకు ఉదాహరణ కూడా ఇస్తా.
మీరు భారత్–పాక్‌ను గమనిస్తే.. వాళ్లు యుద్ధం మొదలుపెట్టారు. పైగా ఆ రెండు అణ్వాయుధ దేశాలు. పరస్పరం 8 యుద్ధ విమానాలు కూల్చేసుకున్నారు. గతంలో లెక్క 7 ఉండేది. ఇప్పుడు 8కి పెరిగింది. వాళ్లకు నేను ఒక్కటే చెప్పి.. మీరు ఇలాగే యుద్ధం చేసుకుంటే.. మీ ఇద్దరిపై భారీగా పన్నులు విధిస్తానని తెలిపా. దీంతో వాళ్లు వెనక్కు తగ్గి యుద్ధాన్ని విరమించారు. టారిఫ్‌లే లేకుంటే.. నేను ఆ యుద్ధాన్ని ఆపగలిగేవాడిని కాదు’అని ట్రంప్ పేర్కొన్నారు.


