
నరేంద్ర మోదీ గొప్ప ప్రధాన మంత్రి అని, తనకు మంచి స్నేహితుడని, అయినా ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పనులు ఎందుకనో నచ్చడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ప్రధాని మోదీ తీసుకున్న ఓ కీలక నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ(UNGA) వార్షికోత్సవ హైలెవల్ సెషన్‌కు హాజరై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే తాజాగా విడుదలైన ప్రసంగ కర్తల జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ పేరును చేర్చారు. దీంతో మోదీ ఉద్దేశపూర్వకంగానే ఆ పర్యటన నుంచి తప్పుకున్నారనే చర్చ జోరందుకుంది.
సెప్టెంబర్ 9వ తేదీన ఐరాస సాధారణ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ‘‘ఒక్కటిగా ఉన్నప్పుడు మెరుగ్గా ఉంటుంది.. శాంతి, అభివృద్ధి & మానవ హక్కుల కోసం 80 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ’’(Better together: 80 years and more for peace, development and human rights )అనే థీమ్‌తో ఈ ఏడాది సెషన్ జరగనుంది.
ఇక.. హైలెవల్ జనరల్ డిబేట్ సెప్టెంబర్ 23-29 తేదీల మధ్య జరగనుంది. ఆనవాయితీ ప్రకారం బ్రెజిల్ ఈ డిబేట్‌లో మొదట ప్రసంగించనుంది. అటుపై యూఎన్‌జీఏ పొడియంలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. రెండో దఫా అధ్యక్షుడు అయ్యాక ఐరాస నుంచి ఆయన ప్రసంగించడం ఇదే తొలిసారి కానుంది.
జులైలో విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్ట్‌లో భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సెప్టెంబర్ 26వ తేదీన ప్రసంగిస్తారని ఉంది. అయితే తాజా లిస్ట్‌లో ఆయన పేరుకు బదులు జైశంకర్ పేరు చేరింది. సెప్టెంబర్ 27వ తేదీన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగించనున్నారు. అంతకు ఒక్కరోజు ముందుగానే.. ఇజ్రాయెల్, చైనా, పాక్, బంగ్లాదేశ్ అధినేతలు ప్రసంగించనున్నారు.
ఇదిలా ఉంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. అయితే.. 50 శాతం సుంకాల విధింపు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారింది. రష్యా చమురు, ఆయుధాల కొనుగోలు నేపథ్యంతో ట్రంప్ భారత్‌పై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే కొనుగోళ్లు ఆపాలంటూ అల్టిమేటం జారీ చేశారు. కానీ..
ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధమని మోదీ ప్రకటించారు. తాజా షాంగై సదస్సులో పుతిన్, జిన్‌పింగ్‌తో మోదీ దోస్తీపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, రష్యాలు అమెరికాకు దూరమై.. కుటిలమైన చైనాకు దగ్గరవుతున్నారనే ఆరోపణ గుప్పించారు. అయితే కొన్నిగంటలకే మాటమార్చా.. అలాంటిదేం లేదన్నారు. భారత్‌తో బంధం ప్రత్యేకమైందన్నారు.
అదే సమయంలో.. భారత్-పాక్ ఉద్రిక్తతలను తానే ఫోన్ కాల్ చేసి చల్లార్చానంటూ ట్రంప్ ప్రకటించుకుంటూ వస్తుండగా.. భారత్ ఆ వాదనను తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ వ్యవహారం భారత్‌లో రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. ఈ క్రమంలోనే కెనడాలో జరిగిన జీ7 సదస్సు నుంచి ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి.. ప్రధాని మోదీ భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ఇక కొత్త రక్షణ ఒప్పందం కోసం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఇప్పుడు ఐరాస కార్యక్రమానికి మోదీ గైర్హాజరు అవుతుండడం ట్రంప్ వైఖరికి నిరసనగానే అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది.