
వాషింగ్టన్: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ), మజీద్ బ్రిగేడ్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థ (ఎఫ్‌టీఓ)లుగా అమెరికా ప్రకటించింది. బీఎల్‌ఏని 2019లోనే.. స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్‌డీజీటీ) జాబితాలో చేర్చిన అమెరికా.. తాజాగా మజీద్ బ్రిగేడ్‌ను కూడా బీఎల్‌ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. 2019 నుంచి ఆ రెండు సంస్థలు చేసిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఎఫ్‌టీవోలుగా గుర్తిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు.
ఈ సంస్థల హింసాత్మక చర్యలు పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అమెరికా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ‘ఉగ్రవాద సంస్థలను ఇలా గుర్తించడం వల్ల వాటికి లభించే సహాయాన్ని, నిధులను నిరోధించవచ్చు. ఈ సంస్థలకు ఆర్థికంగా, భౌతికంగా లభించే మద్దతును చట్టపరంగా నిలిపివేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం’అని ఆయన పేర్కొన్నారు.
పాక్‌పై ఔదార్యం..
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉండగానే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆయన చేసిన విజ్ఞప్తితోపాటు బలమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. జూన్‌లో అమెరికా అధ్యక్షుడితో ము నీర్ ఒక ప్రైవేట్ విందుకు హాజరైనప్పటి నుంచి పాకిస్తాన్ పట్ల అమెరికా అమితమైన ఔదా ర్యం చూపుతోంది. బీఎల్‌ఏని విదేశీ ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయడం అందులో భాగం. మునీర్ అమెరికా పర్యటన సందర్భంగానే ఈ ప్రకటన రావడం అతనికి దౌత్యపరమైన విజయాన్ని అందించింది. అయితే.. తమ దేశంలో విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి బీఎల్‌ఏను భారత్ రెచ్చగొడుతోందని పాకిస్తాన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేయడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.
1970 నుంచి..
బీఎల్‌ఏ ఖనిజ సంపన్న ప్రావిన్స్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తోంది. 1970వ దశకంలో బీఎల్‌ఏ ప్రారంభమైంది. పాక్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో మొదట అధికారంలోకి వచి్చనపుడు బలూచిస్తాన్‌లో సాయుధ తిరుగుబాటు మొదలైంది. సైనిక నియంత జియావుల్ హక్ అధికారం చేజిక్కించుకోవడంతో చర్చల తరువాత సాయుధ తిరుగుబాటు ముగిసింది. బీఎల్‌ఏ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మళ్లీ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాలనలో 2000 సంవత్సరంలో బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలు, భద్రతాదళాలపై వరుస దాడులు చేసింది. 2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఈ సంస్థ చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ ట్రాన్సిట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో చైనా కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బీఎల్‌ఏ బషీర్ జేబ్ నాయకత్వంలో కొనసాగుతోంది. మజీద్ బలూచ్ అనే మిలిటెంట్ పేరుతో మజీద్ బ్రిగేడ్ ఏర్పడింది.
హింసాత్మక దాడులు..
అమెరికా నిఘా నేత్ర బీఎల్‌ఏను చాలా ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. అయితే బీఎల్‌ఏ 2019 తర్వాత అనేక హింసాత్మక దాడులకు పాల్పడింది. మజీద్ బ్రిగేడ్ పేరుతో అనేక దాడులను నిర్వహించింది. 2024లో కరాచీ విమానాశ్రయం సమీపంలో, అలాగే గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడులకు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీయే బాధ్యత వహించింది. 2025 మార్చిలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసింది. ఈ దాడిలో 31 మంది పౌరులు, భద్రతా సిబ్బంది చనిపోగా>.. 300 మందికి పైగా రైలు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు.