
అమెరికా–చైనా అంగీకారం
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలకు కొంత విరామం దొరికింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి చైనాపై అమల్లోకి రావాల్సిన భారీ టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేశానని సొంత ట్రూత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చైనా వాణిజ్య శాఖ కూడా ఇదే రకమైన ప్రకటన చేసింది. అమెరికా ఉత్పత్తులపై అదనంగా విధించిన టారిఫ్‌లకు 90 రోజుల పాటు విరామమిస్తున్నట్లు తెలిపింది.
ఈ పరిణా మంతో రెండు దేశాలు తమ మధ్య విభేదా లను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసు లుబాటు లభించినట్లయింది. అంతేకాదు, ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ట్రంప్– జిన్‌పింగ్‌ల శిఖరాగ్రానికి మార్గం సులువైనట్లేనని భావిస్తున్నారు. తాజా పరిణామాన్ని చైనాతో వాణిజ్యం చేసే అమెరికా కంపెనీలు స్వాగతించాయి. ప్రమాదకర డ్రగ్ ఫెంటానిల్‌పై ఒప్పందం కుదిరితే, అమెరికా టారిఫ్‌లు తగ్గుతాయి, చైనా ప్రతీకార చర్యలను ఉపసంహరించుకుంటుందని అమెరికా–చైనా బిజి నెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సీన్ స్టెయిన్ అభి ప్రాయపడ్డారు.
దాదాపు అన్ని దేశాలపైనా అత్యధికంగా టారిఫ్‌లు, పన్నులు విధించడం ద్వారా ప్రపంచ వాణిజ్య వ్యవస్థను కకావికలం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా విషయంలో మాత్రం తాత్సారం చేస్తు న్నారు. కీలక ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహ నాలు మొదలు జెట్ విమానాల ఇంజన్ల వరకు వాడే మాగ్నెట్లపై చైనా ఆధిపత్యం ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ ఏడాది మేలో చైనా ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్‌లను ట్రంప్ ప్రకటించగా, అమెరికా ఉత్పత్తులపై డ్రాగన్ దేశం 125శాతం టారిఫ్ లను విధించింది. అనంతరం, రెండు దేశాలు వెనక్కి తగ్గి, జెనీవాలో చర్చలు మొదలుపెట్టాయి.