హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి | Pro-Khalistani Supporters Attacks Devotees At Hindu Temple In Canada Brampton, More Details Inside | Sakshi
Sakshi News home page

హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి

Nov 4 2024 7:59 AM | Updated on Nov 4 2024 1:04 PM

Khalistani Supporters Attack Hindu Temple

బ్రాంప్టన్‌: కెనడా ప్రభుత్వం భారత్‌పై విషం చిమ్మిన అనంతరం అక్కడి ఖలిస్తానీ మద్దతుదారుల మనోబలం మరింతగా పెరిగినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆదివారం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తానీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. ఒక హిందూ దేవాలయం వెలుపల విధ్వంసం సృష్టించారు.

బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒక ప్రకటనలో తన స్పందన తెలియజేశారు. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన హింసాత్మక సంఘటనలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి కెనడియన్‌కు తన ఇష్టం మేరకు మతాభిమానాలకు కొనసాగించే హక్కు ఉంది. అయితే ఒక వర్గపు సమాజాన్ని రక్షించడానికి, ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి తక్షణమే స్పందించాలని ఆయన ప్రాంతీయ పోలీసులను ఆదేశించారు.

బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ఈ ఘటనపై మాట్లాడుతూ బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల గురించి విని ఆందోళన చెందాను. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కు. ప్రతి వ్యక్తి తమ ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉండాలి. ప్రార్థనా స్థలం వెలుపల జరిగిన హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. శాంతిభద్రతల పరిరక్షణకు, హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీసులు ఉపక్రమిస్తున్నారు. దోషులుగా తేలిన వారిని చట్టం ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు.

కాగా కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు  పరిధులు దాటిపోయారని కెనడా పార్లమెంటులో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆచార్య అన్నారు. హిందూ దేవాలయంపై జరిగిన దాడి.. కెనడాలో ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాదం  ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందని,  భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదులకు  దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చంద్ర ఆరోపించారు.



ఇది కూడా చదవండి: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం

Advertisement
 
Advertisement
Advertisement