
ఒట్టావా: ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ కేఫ్‌పై మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కెనడాలోని సర్రీలో ఉన్న ఈ ‘కాప్స్ కేఫ్’పై నిందితులు కాల్పులకు తెగబడ్డారు.
అయితే,ఈ దాడికి పాల్పడింది తామేనని గుర్‌ప్రీత్ సింగ్ అలియాస్ గోల్డీ ధిల్లాన్,లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముఠా ప్రకటించింది. ఈ కాల్పుల సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాప్స్ కేఫ్‌పై నిందితులు సుమారు 25 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
కాల్పులు జరిపే సమయంలో.. నిందితులు సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ‘మేం మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశాం. కానీ మీరు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టే ఈ దాడికి తెగబడ్డాం.. ఇప్పుడు కూడా మా హెచ్చరికల్ని పట్టించుకోకపోతే.. మరో దాడి ముంబైలో జరుగుతుంది’ అని హెచ్చరించడాన్ని గమనించొచ్చు.
సంభాషణ ఆధారంగా.. నిందితులు కపిల్ శర్మను కలిసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. వాళ్లు ఏ విధంగా కపిల్ శర్మను సంప్రదించే ప్రయత్నం చేశారు అన్నది తెలియాల్సి ఉంది. కపిల్ శర్మకు బెదిరింపులతో ముంబై పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు అప్రమత్తయ్యాయి.
కాగా,కపిల్ శర్మ కొత్తగా ప్రారంభించిన కాప్స్ కేఫ్‌పై తొలిదాడి గత జులై నెలలో జరిగింది. సిబ్బంది లోపల ఉండగానే జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆస్తినష్టం మాత్రం జరిగింది. తానే కాల్పులు జరిపానని ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్‌సింగ్ లద్ధీ ప్రకటించాడు. కపిల్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై అసంతృప్తితోనే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.