2026 నోబెల్ శాంతి బహుమతి రేసు అనూహ్య మలుపు తిరిగింది. సాధారణంగా రాజకీయ నేతలు, మానవతావాద సంస్థలు, అంతర్జాతీయ సంస్థల పేర్లు వినిపించే ఈ పోటీలో ఈసారి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) కూడా చర్చకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, పోప్ లియో తదితరులతో పాటు ఐఎస్‌ఎస్ పేరు కూడా నిపుణుల అంచనాల్లో వినిపిస్తోంది. అయితే వీరిలో ఎవరూ అధికారికంగా నామినేట్ అయ్యారనే ధ్రువీకరణ లేదు. నోబెల్ కమిటీ విజేతను అక్టోబర్ 9న ఓస్లోలో ప్రకటించనుంది.
287 నామినేషన్లు.. జాబితా మాత్రం రహస్యమే
2026 నోబెల్ శాంతి బహుమతికి మొత్తం 287 అర్హత కలిగిన నామినేషన్లు అందాయి. ఇందులో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. అయితే అధికారిక నామినీల జాబితాను నార్వేజియన్ నోబెల్ కమిటీ బహిర్గతం చేయదు. అందువల్ల నిపుణుల అంచనాలు, ప్రిడిక్షన్ మార్కెట్లు, బహిరంగ చర్చల్లో వినిపిస్తున్న పేర్లను అధికారిక నామినీలుగా పరిగణించలేం. తుది నిర్ణయం పూర్తిగా నోబెల్ కమిటీ చేతుల్లోనే ఉంటుంది.
అంతరిక్ష కేంద్రానికి ఎందుకు ప్రాధాన్యం?
భౌగోళిక, రాజకీయ విభేదాలు తీవ్రంగా ఉన్న సమయంలో కూడా దేశాలు కలిసి పనిచేయగలవనే సందేశానికి ఐఎస్‌ఎస్ ప్రతీకగా నిలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడాకు చెందిన వ్యోమగాములు, శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష కేంద్రంలో కలిసి పనిచేశారు. రాజకీయంగా పరస్పరం విభేదించే దేశాలు కూడా శాంతియుత ఉమ్మడి ప్రాజెక్టులో సహకరించగలవనే అరుదైన ఉదాహరణగా ఐఎస్‌ఎస్ నిలిచింది. 2000 నవంబర్ నుంచి అక్కడ నిరంతరంగా మనుషుల ఉనికి కొనసాగుతోంది. అందుకే ఏదైనా గుర్తింపు లభిస్తే అది ఒక్క శాస్త్రీయ విజయానికి కాకుండా అంతర్జాతీయ సహకారానికి ప్రతీకగా భావించే అవకాశం ఉంది.
ట్రంప్ పేరు ఉన్నా.. అవకాశాలపై సందేహాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి పోటీదారుగా చర్చకు వస్తున్నారు. ఈ అవార్డు తనకు రావాలని ట్రంప్ గతంలో పలుమార్లు ఆకాంక్షించారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయనను నామినేట్ చేశారు. అయితే ఇటీవలి నిపుణుల అంచనాల్లో ట్రంప్‌కు అవకాశాలు అంతగా లేవనే అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ నేతృత్వంలోని ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ కూడా ఆయన అవకాశాలపై ప్రభావం చూపే అంశాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. అయితే చివరికి నోబెల్ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోనున్నది.
కార్నీ, జెలెన్‌స్కీ, పోప్ లియో..
కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేరు కూడా ఈసారి నిపుణుల చర్చల్లో కనిపిస్తోంది. అమెరికా సుంకాల విధానాలను ఆయన వ్యతిరేకించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలపరచాలని కోరడం దీనికి కారణాలుగా చెబుతున్నారు. అయితే ఆయన నోబెల్ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నట్లు అధికారిక సమాచారం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరు కూడా పోటీదారుల్లో వినిపిస్తోంది. అమెరికాలో జన్మించిన తొలి పోప్‌గా గుర్తింపు పొందిన పోప్ లియో కూడా చర్చలో ఉన్నారు. పశ్చిమాసియాలోని యుద్ధంపై ఆయన పలుమార్లు మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో ఆయన వైఖరి ట్రంప్ అభిప్రాయాలకు భిన్నంగా కూడా ఉంది.
మానవతావాద సంస్థలు మొదలు..
నోబెల్ శాంతి బహుమతి చర్చల్లో పలు మానవతావాద సంస్థలు, వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. సేవ్ ద చిల్డ్రన్, ఉక్రెయిన్ బాలల హక్కుల కార్యకర్త మైకోలా కులేబా, సూడాన్‌కు చెందిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్స్, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ తదిరుల పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయం, జవాబుదారీతనం, ఘర్షణలను న్యాయపరమైన మార్గాల్లో పరిష్కరించే ప్రయత్నాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే), అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) పేర్లు కూడా నిపుణుల అంచనాల్లో కనిపిస్తున్నాయి. ఈ విభిన్న పేర్ల మధ్య 2026 నోబెల్ శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. విజేతను అక్టోబర్ 9న ఓస్లోలో ప్రకటించనున్నారు.
ఇదీ చదవండి: ‘క్యాప్సూల్ వార్డ్‌రోబ్’ వెంట ‘జెన్ జెడ్’ పరుగులు!


