ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని హెబ్రాన్‌లో ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఏడు నెలల పసికందు మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతని తల్లిదండ్రులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.
బెత్లెహెమ్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న తండ్రి ఫహద్ అబు హైకల్ మీడియాతో మాట్లాడుతూ ఒక బుల్లెట్ మొదట తన చేతికి తగిలి.. ఆ తర్వాత వెనుక సీట్‌లో తల్లితో కలిసి కూర్చున్న తన కుమారుడికి తగిలిందని చెప్పారు. సైనికుడు నన్ను ఆగమని సైగ చేశారు. నేను కారును పూర్తిగా ఆపి, స్టీరింగ్ వీల్‌పై నా చేతులు పైకెత్తాను. ఆ వెంటనే వారు వాహనంపై కాల్పులు జరిపారని ఆయన తెలిపారు.
కాల్పులు జరిగిన సమయంలో తాము తమ 11 ఏళ్ల కుమారుడు, తల్లితో కలిసి ప్రయాణిస్తున్నట్లు అబు హైకల్ చెప్పారు. కారులో ఉన్నవారిని గుర్తించడంలో సైనికులు పొరపాటు పడి ఉంటారనే వాదనను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఆ సైనికుడు నాకు కేవలం 10 మీటర్ల దూరంలో ఉన్నాడు. అతను నన్ను, నా భార్యను, పిల్లలను చూశాడు. కారు కిటికీలకు నల్లటి గ్లాసులు లేవు. అది పట్టపగలు కావడం వల్ల అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారులో కుటుంబం ప్రయాణం చేస్తుందని ఆవ్యక్తికి తెలియదా?’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమీక్షిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఒక వాహనం తమ వైపు వేగంగా దూసుకువస్తోందని భావించి సైనికులు కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపినట్లు 'ది గార్డియన్' పేర్కొంది. మిలిటరీ సమాచారం ప్రకారం.. సైనికులు ఒక వాహనం తమ వైపు వేగంగా దూసుకురావడాన్ని గమనించారు.. అందులోని ఓ సైనికుడు ఆ వాహనంపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు పాలస్తీనియన్లు గాయపడ్డారు.
వారిని వైద్య చికిత్స కోసం తరలించామని ఐడీఎఫ్ తెలిపింది. ఏదైనా తప్పు జరిగి ఉంటే.. సంబంధం లేని వ్యక్తులకు జరిగిన నష్టానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని ఐడీఎఫ్ పేర్కొంది. ప్రాథమిక మిలిటరీ విచారణలో గాయపడిన వారు ఎలాంటి శత్రుత్వ కార్యకలాపాలలో పాలుపంచుకోని సాధారణ పౌరులుగా తేలింది. బాధ్యులను శిక్షించాలని తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, సంబంధిత సైనికుడిని బాధ్యుడిని చేయాలని అబు హైకల్ డిమాండ్ చేశారు.


