1949లో విడిపోయారు : మళ్లీ అనుకోకుండా ఇలా ! | Chinese Man HelpsTourist Take Photo Discovers Stranger Is His Long Lost Relative | Sakshi
Sakshi News home page

1949లో విడిపోయారు : మళ్లీ అనుకోకుండా ఇలా!

Jul 25 2026 12:47 PM | Updated on Jul 25 2026 2:08 PM

Chinese Man HelpsTourist Take Photo Discovers Stranger Is His Long Lost Relative

దశాబ్దాల క్రితం విడిపోయిన తన పూర్వీకుల కుటుంబాన్ని కలుసుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది.  ఒక పర్యాటక ప్రాంతంలో జరిగిన సాధారణ సంభాషణ ఇంత మ్యాజిక్‌ చేస్తుందని వారు అస్సలు ఊహించలేదు. చైనాలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.  ఇంతకీ అసలు ఏమైంది?

షాంఘైకి చెందిన చెన్ జీ (Chen Jie) తన బిజినెస్‌ పనిపై యున్నాన్ ప్రావిన్స్‌లోని లూగూ సరస్సు (Lugu Lake) వద్దకు వెళ్లాడు. జూలై 9 ఉదయం సూర్యోదయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇంతలో  తైవాన్‌కు చెందిన ఫే (Fei) అనే వృద్ధ పర్యాటకుడు అక్కడకు వచ్చాడు. ఇంత అందమైన  ప్రదేశంలో తనకు ఒక ఫోటో తీసిపెట్టమని అడిగాడు.  ఆ  తరువాత అతనితో ఒక సెల్ఫీ తీసుకున్న చెన్‌ మాటలు కలిపాడు. తీరా చూస్తే, అతను అపరిచితుడు కాదని, చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కుటుంబ సభ్యుడని తరువాత తెలుసుకున్నాడు. తమ పూర్వీకుల ఊరు "పుయువాన్" (Puyuan) అని ఫే చెప్పడంతో చెన్ ఆశ్చర్య పోయాడు. ఎందుకంటే చెన్ సొంత ఊరు కూడా అదే కావడంతో ఈ  విషయాన్ని చెన్ తన తండ్రికి చెప్పగా, ఫే తండ్రి పేరు "ఫే యున్‌ఫెంగ్" ఏమో అడగమన్నాడు. అలా ఫే తండ్రి  చెన్ తాతగారు సొంత అన్నదమ్ములని తేలింది. దీంతో ఇద్దరూ సంతోషంగా ఉక్కిరిబిక్కిరయ్యారు. కుటుంబ వరస ప్రకారం ఫే, చెన్ జీకి బాబాయి అవుతారు.

1949 నాటి చరిత్ర: ఎందుకు విడిపోయారు
1949లో ఫే తండ్రి తైవాన్‌కు వెళ్లిపోగా, చెన్ తాతగారు వేరొక కుటుంబానికి దత్తత వెళ్లడం వల్ల వారి ఇంటిపేరు 'చెన్'గా మారింది. కాలక్రమేణా, ఫేయ్ తండ్రి, చెన్ తాత ఇద్దరూకన్నుమూశారు. కానీ  కొన్ని దశాబ్దాల తర్వాత  మళ్లీ ఇపుడు యాదృచ్ఛికంగా కలుసుకున్నారు.  ఫెయ్ తండ్రి స్వయంగా చైనాకు రాలేకపోయినా, 1991లో తన సోదరుడికి ఒక లేఖ పంపారు. ఆయన ఒకరి ద్వారా 200 డాలర్లు కూడా పంపారు. ఆ సమయంలో చైనా ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదని, 200 డాలర్లను ఒక గణనీయమైన మొత్తంగా పరిగణించే వారని చెన్ వివరించారు. 

ఆ లేఖలో ఇలా  ఉంది, "ఈ డబ్బు నా ప్రేమకు,ఆప్యాయతకు గుర్తు. నేను ఈ సంవత్సరం చైనాకు రాలేకపోతున్నాను. వచ్చే ఏడాది మనం కలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. దేవుడు మీ కుటుంబంలోని వారందరినీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను." అని రాశారు. ఆ కుటుంబం ఇప్పటికీ ఆ లేఖను భద్రంగా దాచుకుంది. దశాబ్దాల పాటు ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయినప్పటికీ, 1980ల చివరలో తైవానీయులు చైనాలోని తమ బంధువులను సందర్శించడానికి అనుమతించడం ప్రారంభమైంది. 

కొన్నిసార్లు, జీవితంలో ఎదురయ్యే సంఘటనలు అచ్చం  సినిమా కథలా అనిపిస్తాయి ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు మన రెండు కుటుంబాల మధ్య సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం బహుశా మన తరం బాధ్యత అంటూ చెన్‌ ఆనందం ప్రకటించారు. విధి వారి తర్వాతి తరాన్ని కలిపింది అని ఫేయ్ అన్నారు.  లేదంటే అక్కడ ఎంతోమంది ఉన్నా ఫే తననే ఫోటో తీయమని అడగడం, ఎపుడో  విడిపోయిన తన దగ్గరి బంధువు దొరకడం ఒక అద్భుతమని చెన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఫే తన సొంత ఊరైన పుయువాన్ సందర్శించి, ఎన్నో ఏళ్ల తర్వాత దొరికిన 20 మంది కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోబోతున్నారన్నమాట. కొన్నిసార్లు విధి నమ్మలేనంతటి వింత ఆటలు ఆడుతుంది అంటే ఇదేనేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement