కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో ఇజ్రాయెల్ రాయబారులు గజగజ వణికిపోతున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారిక వార్తాసంస్థ ‘యెదువోత్ అహ్రోనోత్’ స్వయంగా పేర్కొంది. ప్రస్తుతం కీవ్‌లో మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రష్యా భారీ దాడులతో అక్కడ వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అంతేకాదు.. మూడ్రోజులుగా ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా లేదు. దీంతో.. ఇజ్రాయెల్ రాయబారులు చలికి గజగజ వణికిపోతున్నారు.
ఇజ్రాయెల్ రాయబారి మైఖేల్ బ్రాడ్స్కీ ఈ సందర్భంగా వైనెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘కీవ్ ఇప్పుడు ఘోస్ట్ సిటీగా మారిపోతోంది. విద్యుత్తు లేకపోవడంతో.. హీటర్లు పనిచేయక ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో.. పరిసర నగరాలకు తరలిపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
యుద్ధం కొనసాగుతున్నా.. తాము రాయబార కార్యాలయ విధులకు ఆటంకం కలిగించడం లేదని, అయితే.. మౌలిక సదుపాయాలు మృగ్యమవ్వడంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించారు. ‘మేము ఉంటున్న అపార్ట్ మెంట్లలో విద్యుత్తు లేదు. బయట మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దాంతో వెచ్చని కోట్లు ధరించి గడపాల్సి వస్తోంది. శీతాకాలం చలికి తోడు.. రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో ఉంటున్న ఇజ్రాయెలీలకు రక్షణ కల్పించేందుకు మేము మా వంతు కృషి చేస్తున్నాం’ అని ఆయన వివరించారు.
దీనిపై కీవ్ మేయర్ మాట్లాడుతూ రష్యా దాడులతో వేల మంది పౌరులు చీకట్లో మగ్గిపోతున్నారని, చలికి వణుకుతున్నారని వాపోయారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కాగా.. రష్యా ప్రయోగించిన హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఓర్ష్నిక్’ కారణంగా కీవ్‌లోని విద్యుత్తు వ్యవస్థ చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే.. పౌరులకు ఇబ్బందులు కలగకుండా జనరేటర్లను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


