ఒప్పందం ఉత్తదేనా?  | Israel continues attacks on Lebanon despite agreeing to ceasefire | Sakshi
Sakshi News home page

ఒప్పందం ఉత్తదేనా? 

Jun 21 2026 5:15 AM | Updated on Jun 21 2026 6:39 AM

Israel continues attacks on Lebanon despite agreeing to ceasefire

లెబనాన్‌పై మళ్లీ ఇజ్రాయెల్‌ భీకర దాడులు  

నబాతియే నగరం సహా పరిసర గ్రామాలపై బాంబుల వర్షం  

ఇద్దరు చిన్నారులు సహా 16 మంది మృతి  

జెరూసలేం: దక్షిణాసియాలో శాంతి సాధనే ధ్యేయoగా అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి ఏ విలువా లేకుండాపోతోంది. ఇరుదేశాల అధ్యక్షులు స్వయంగా సంతకాలు చేసిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఏమాత్రం లేక్కచేయడం లేదు. దాంతో తమకు సంబంధమే లేదన్నట్లుగా లెబనాన్‌పై భీకర దాడులకు దిగుతోంది. గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన వైమానిక, డ్రోన్‌ దాడుల్లో 47 మంది మరణించగా, ఇజ్రాయెల్‌ సైన్యం శనివారం సైతం దాడుల పరంపర కొనసాగించింది. 

దక్షిణ లెబనాన్‌పై జరిగిన తాజా దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా కనీసం 16 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. నబాతియే నగరంతోపాటు పరిసర గ్రామాలు బాంబుల మోతతో దద్దరిల్లాయి. పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం ఏడుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు లెబనాన్‌ జాతీయ వార్తా సంస్థ తెలియజేసింది. స్థానికులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నట్లు సమాచారం. ఇరాన్‌ అండదండలతో లెబనాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెజ్‌బోల్లా మిలిటెంట్‌ గ్రూప్‌ను అంతం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్‌ చెబుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇజ్రాయెల్, హెజ్‌బోల్లా అంగీకరించినట్లు శుక్రవారం వార్తలొచ్చాయి. కానీ, అందులో నిజం లేదని శనివారం నాటి దాడులతో తేలిపోయింది.  

ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్‌ కారణం: హెజ్‌బోల్లా  
దక్షిణ లెబనాన్‌లో ఉన్న తమ సైన్యంపై హెజ్‌బొల్లా గ్రూప్‌ తొలుత దాడులకు పాల్పడిందని, 50కి పైగా క్షిపణులను ప్రయోగించిందని, దాంతో తమ సైన్యం ఎదురుదాడికి దిగినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా రాకెట్‌ ప్రయోగ స్థావరాలు, కమాండ్‌ సెంటర్లతో సహా డజన్ల కొద్దీ లక్ష్యాలు, మిలిటెంట్లపై దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ ఉద్రిక్తతలకు ముమ్మాటికీ ఇజ్రాయెల్‌ కారణమని హెజ్‌బోల్లా ఆరోపించింది. కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. అయితే, శుక్రవారం రాత్రి కాల్పుల విరమణను ఇజ్రాయెల్‌ పలుమార్లు ఉల్లంఘించినట్లు విమర్శించింది.  

ఒప్పందానికి ముప్పు?  
మధ్యంతర (అవగాహనా) ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఇరాన్‌ అధ్యక్షుడు మసూదు పెజెష్కియాన్‌ సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. లెబనాన్‌లో తక్షణమే సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలన్న షరతును ఈ ఒప్పందంలో చేర్చారు. కానీ, దీనిపై ఇజ్రాయెల్‌ గానీ, హెజ్‌బొల్లా గానీ సంతకాలు చేయలేదు. అందులో భాగస్వామిగా చేరలేదు. రెండు పక్షాల దాడులు, ప్రతిదాడులు ఇలాగే కొనసాగితే మధ్యంతర ఒప్పందానికి ముప్పు వాటిల్లినట్లేనని, పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌కు ముప్పు తొలగిపోయే వరకు దక్షిణ లెబనాన్‌లో తమ బలగాలను కొనసాగిస్తామని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టంచేశారు. లెబనాన్‌ నుంచి వైదొలగడానికి ఇజ్రాయెల్‌ ఒప్పుకుంటే తప్ప తాము దాడులను ఆపలేమని హెజ్‌బోల్లా చెబుతోంది. లెబనాన్‌ ప్రభుత్వం, ఇజ్రాయెల్‌ మధ్య తదుపరి విడత చర్చలు వచ్చేవారం వాషింగ్టన్‌లో జరుగుతాయని సమాచారం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement