దుబాయ్: తమ దేశంలోని నిరసనకారులకు మద్దతు తెలుపుతూ పదే పదే జోక్యం చేసుకుంటున్న అమెరికాను ఇరాన్ మరోసారి హెచ్చరించింది. అమెరికా తమపై దాడికి యత్నించాలనే యత్నిస్తే అంతకుమించి ఎదురుదాడులకు దిగుతామని ఇరాన్ స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా సైనికా దళానికి పొరుగు దేశాలు ఏమైనా సహకారం అందిస్తే మాత్రం ఆ స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లతో దాడులకు దిగుతామని పేర్కొంది. ఇరాన్‌కు సమీపంలో అత్యాధునిక డ్రోన్ల నిఘాను అమెరికా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం హీటెక్కింది. ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. అమెరికా గనుక వెనక్కి వెళ్లకపోతే మాత్రం మూల్యం చెల్లించుకుంటారని ఇరాన్ హెచ్చరించింది.
కాగా, గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.


