టెహ్రాన్: ఇరాన్‌లో నిరసనలు చేస్తున్న వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం మతాధికారి అహ్మద్ ఖటామీ ఈ మేరకు మరణ ఆజ్ఞలను విడుదల చేశారు. ‘‘ఇది దేవుని తీర్పు’’ అని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. శుక్రవారం ఆయన టెహ్రాన్‌లో జరిగిన ప్రార్థనలకు నాయకత్వం వహించారు.
ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక రేడియో వెల్లడించింది. నిరసనకారులను ఉరితీయాలంటూ ఖటామీ ఫత్వాను జారీ చేయగానే.. ఆ ప్రాంగణం కేరింతలతో మార్మోగిపోయింది. ఇదే వేదికపైనుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా ఖటామీ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై దాడిని వాయిదా వేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్న మర్నాడే.. ఖటామీ నుంచి ఈ తరహా ఫత్వా జారీ కావడం గమనార్హం..! గల్ఫ్ దేశాలు ముక్తకంఠంతో కోరడంతో.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోగా.. ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ ఊపిరి పీల్చుకున్నాడు. మరోవైపు ఇరాన్‌లోని భారతీయులను తరలించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలను ప్రారంభించింది. అటు ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో ఇరాన్ ఉప రాయబారి గులాం హుస్సేన్ దర్జీ ప్రస్తుత పరిస్థితులపై ఓ ప్రకటన చేశారు.
తమ దేశంలో గందరగోళానికి అమెరికానే కారణమని ఆరోపించారు. ఇరాన్‌లో జరుగుతున్న అల్లర్ల వెనక అమెరికా వ్యూహాత్మక హస్తముందని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మళ్లీ ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీపై గుర్రుగా ఉన్నట్ల తెలుస్తోంది. ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ట్రంప్ సీరియస్ అయినట్లు సమాచారం. ఇదెలా ఉండగా.. ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) అధికారులు ప్రకటించారు. గూఢచర్యం నేరానికి ఇరాన్‌లో మరణశిక్ష ఉంటుంది. తాము అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారని, వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులని ఆరోపించారు.


