‘ప్రతీకారం తీర్చుకుంటాం​..’ అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు! | Iran accuses US of breaching truce | Sakshi
Sakshi News home page

‘ప్రతీకారం తీర్చుకుంటాం​..’ అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!

Apr 20 2026 6:56 AM | Updated on Apr 20 2026 8:31 AM

Iran accuses US of breaching truce

ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. రెండో దఫా చర్చలపై ప్రతిష్టంబన కొనసాగుతుండగా.. అమెరికా నౌకాదళం ‘‘టౌస్కా’’ అనే ఇరాన్ వాణిజ్య నౌకను అడ్డగించి స్వాధీనం చేసుకుంది. ఈ నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చైనా నుండి ఇరాన్ వైపు ప్రయాణిస్తుండగా పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ చర్యకు గట్టి ప్రతీకారమే ఉంటుందని ఇరాన్‌ హెచ్చరిస్తోంది. 

కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. హర్ముజ్‌ జలసంధిని దిగ్బంధించింది అమెరికా. తమ సైన్యం హెచ్చరించినా ఆ నౌక ఆగలేదని.. అందుకే స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్‌ మండిపడింది. ఇరాన్ సైనిక కమాండ్ ఖాతమ్ అల్-అన్బియా ఈ చర్యను.. సముద్ర దొంగతనంగా, ఆయుధ దోపిడీగా అభివర్ణించారు. అమెరికా రెండు వారాల కాలం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. అమెరికా దాడికి తగిన ప్రతిస్పందన ఇస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో.. నౌకను అమెరికా మెరైన్లు స్వాధీనం చేసుకున్నారని, ప్రస్తుతం నౌకపై పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. ఈ నౌకపై గతంలో అక్రమ కార్యకలాపాలు జరిపినందుకు అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించిందని ఆయన గుర్తు చేశారు.

మొదట ఇరాన్ ఈ ఘటనను ఖండిస్తూ.. తమ నౌకాదళం సమయానికి స్పందించి అమెరికా దాడిని అడ్డుకుందని ప్రకటించింది. అయితే, తరువాత అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోలో నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టమైంది. ఈ సంఘటనతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

చర్చలపైనా ఉత్కంఠ
ఇరాన్–అమెరికా మధ్య ఇస్లామాబాద్‌(పాకిస్తాన్‌) వేదికగా తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ అమెరికా ప్రతినిధుల బృందం పాక్‌కు వెళ్తుందని ట్రంప్‌ ప్రకటించారు. అయితే.. ఇరాన్‌ మాత్రం ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదని అంటోంది. హర్ముజ్‌లో అమెరికా కవ్వింపు చర్యలు, తమకు వ్యతిరేకంగా ఇస్తున్న ప్రకటనల నేపథ్యంలో చర్చలకు వెళ్లబోమని ప్రకటించింది. దీంతో ట్రంప్‌ ఇరాన్‌పై భగ్గుమన్నారు. చర్చలకు రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఈ నెల 22తో ముగియనుంది. ఇరాన్‌ దిగిరాకుంటే కాల్పుల విరమణ పొడిగింపు ఉండదని.. భీకర దాడులు జరుపుతామని ట్రంప్‌ అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement