రోదసిలో శాంతి మంత్రం.. ఐఎస్ఎస్‌కి నోబెల్ శాంతి? | International Space Station being considered for Nobel Peace Prize | Sakshi
Sakshi News home page

రోదసిలో శాంతి మంత్రం.. ఐఎస్ఎస్‌కి నోబెల్ శాంతి?

Oct 7 2026 11:20 AM | Updated on Oct 7 2026 11:51 AM

International Space Station being considered for Nobel Peace Prize

నోబెల్ సీజన్ వచ్చేసింది. ఇప్పటికే వైద్య, భౌతికశాస్త్రాల్లో విజేతల పేర్లు ప్రకటించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్-ఐఎస్ఎస్) ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ బరిలోకి దిగుతోంది. ఐఎస్ఎస్... ఎల్లలు లేని ప్రపంచం. విశ్వంలో మానవాళి సృష్టించిన ‘త్రిశంకు స్వర్గం’. స్వర్గం అన్నాక వైరం, వైషమ్యాలకు తావుండదు కదా! అంతరిక్ష కేంద్రంలో మిత్రదేశాలే కాదు... శత్రుదేశాల వ్యోమగాములు కూడా నేస్తాలుగా మెలుగుతారు. అందులో గడిపినంత కాలం వారు విశ్వమానవులు. సౌభ్రాతృత్వం, పరస్పర సహకారం వెల్లివిరుస్తాయి. అక్కడ మనస్పర్థలు, వివాదాలు, తగాదాలు, యుద్ధాలకు చోటు లేదు. అక్కడ దేశాలు, జాతీయత భేదాలు ఉండవు. అందరిదీ ఒకటే మతం, ఒకటే దేశం, వసుధైక కుటుంబం.

అంతరిక్ష కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా ఇదే సత్సంప్రదాయం, సంస్కృతి పరిఢవిల్లుతున్నాయి. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి కోసం 79 సంస్థలు సహా మొత్తం 287 మంది అభ్యర్థుల నుంచి నార్వీజియన్ నోబెల్ కమిటీకి ప్రతిపాదనలు అందాయి. నామినీల్లో సంస్థల పేర్లే నాలుగో వంతుకు పైగా ఉండటం విశేషం. వ్యక్తులు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ సంస్థలే కాకుండా... యుద్ధాలు, ప్రకృతి విపత్తుల వేళ ఆపన్నహస్తం సాచే మానవతా గ్రూపుల పేర్లు కూడా అందులో ఉన్నాయి. కానీ విజేత ఎంపిక విషయంలో చివరి నిమిషంలో అనూహ్యంగా ఐఎస్ఎస్ పేరు తెరపైకి వస్తోంది.

పీస్ ప్రైజ్ కోసం ప్రస్తుతం పోటీపడుతున్న వారి పేర్లను నోబెల్ కమిటీ ఇంతవరకు ప్రచురించలేదు. దాంతో నామినీలకు సంబంధించి అధికారికంగా ‘కుదించిన జాబితా’, అందులోని పోటీదారుల పేర్లు బయటకి తెలియరాలేదు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 9న (శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు నార్వేలోని ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతి విజేత పేరు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు తమ వేళ్లను పైకి అంతరిక్ష కేంద్రం వైపు చూపుతున్నారు! ఐఎస్ఎస్ ఏ ఒక్క దేశం సొత్తు కాదు. అది అమెరికా, రష్యా, కెనడా, జపాన్, యూరప్ దేశాల ఉమ్మడి ఆస్తి. పలు దేశాల పరస్పర సహకారానికి చిరునామా. భూమ్మీద ఉద్రిక్తతలు పెచ్చరిల్లే, యుద్ధాలు జరిగే దేశాల ఆస్ట్రోనాట్లు-కాస్మోనాట్లు సైతం అవేమీ పట్టనట్టు భూకక్ష్యలోని అంతరిక్ష కేంద్రంలో సంయమనంతో వ్యవహరిస్తూ పరిశోధనల్లో నిమగ్నమవుతారు.

రేసులో ట్రంప్, కార్నీ, కులేబా, ఐసీసీ! 
నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ, ఉక్రెయిన్ బాలల హక్కుల ఉద్యమకారుడు మైకోలా కులేబాతోపాటు సేవ్ ద చిల్డ్రన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్స్ (సూడాన్), కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్, అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే), అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఇంటెర్నేషనల్ క్రిమినల్ కోర్టు- ఐసీసీ) పోటీ పడుతున్నాయి. వీటిలో ధర్మ సంస్థాపన-శాంతిస్థాపన దిశగా ఐసీసీ పెద్దగా పొడిచిందేమీ లేకపోయినా కాస్తోకూస్తో వీర-శూరత్వాలు ప్రదర్శించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు రాజకీయ నేతలపై ఐసీసీ అరెస్టు వారంట్లు జారీ చేసింది. 
-జమ్ముల శ్రీకాంత్‌.
(Courtesy: Associated Press)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement