
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈస్ట్ జావా రాష్ట్రం సిడోయార్జి పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ భవనం కుప్పకూలిపోయింది(School Building Collapse). ఈ ఘటనలో ఒక విద్యార్థి మరణించగా.. వంద మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఆ ఇస్లామిక్ స్కూల్‌లో ప్రార్థనలు జరుగుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. భవనం కుప్పకూలడంతో ఒక విద్యార్థి (13) అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించగా.. వాళ్లలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 38 మంది విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి ఉంది. వీళ్లంతా శిథిలాల్లో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

శిథిలాల కింది నుంచి చిన్నారుల కేకలతో, తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. కాంక్రీట్ దిమ్మెలు భారీ పరిణామంలో ఉండడం.. వాటిని కదిలిస్తే మరింత కుప్పకూలిపోయే అవకాశం ఉండడంతో సహాయక చర్యలు జాగ్రత్తగా, నిదానంగా సాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక కూడా సహాయక చర్యలు కొనసాగాయి.

రెస్క్యూ బృందాలు(Rescue Teams) తీవ్రంగా శ్రమించి.. 102 మందిని రక్షించినట్లు కాంపోస్.డాట్ కామ్ అనే స్థానిక మీడియా వెబ్‌సైట్ కథనం ఇచ్చింది. స్కూల్ భవనం పాతది కావడం.. అనుమతి లేకుండా పై అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ప్రతినిధి జూల్స్ అబ్రహాం అబాస్ట్ తెలిపారు.

ఇదీ చదవండి: చిగురుటాకులా వణికిపోయిన వియత్నాం!