
9 మంది మృత్యువాత, 17 మంది గల్లంతు
హనోయి: భారీ వర్షం, భీకరగాలులతో కూడిన బ్వాలోయి తుఫాను వియత్నాంలో విలయం సృష్టించింది. తుఫాన్ తీవ్రతకు పలు ప్రావిన్సుల్లో రోడ్లు జలమయం కాగా, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. గంటకు 133 కిలోమీటర్ల వేగంగా గాలులు తీయడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ ఘటనల్లో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
జాడ తెలికుండా పోయిన 17 మంది జాలర్ల కోసం గాలింపు చేపట్టినట్లు యంత్రాంగం తెలిపింది. సోమవారం ఉదయం 10 గంటలకు తుఫాన్ బలహీనపడి లావోస్ దిశగా వెళ్లిందని అధికారులు తెలిపారు. గాలుల తీవ్రతకు ఇళ్లు కూలిన ఘటనల్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నిన్హ్ బిన్హ్ ప్రావిన్స్‌లోనే ఆరుగురు చనిపోయారని చెప్పారు. థన్హ్ హొవా, హూయి, దనంగ్ ప్రావిన్స్‌ల్లో జరిగిన ఘటనల్లో మరో ముగ్గురు మృతి చెందారు. క్వాంగ్ ట్రి ప్రావిన్స్‌లో గాలుల తీవ్రతకు లంగరేసిన చేపల పడవ తాళ్లు తెగడంతో అది సముద్ర జలాల్లోకి కొట్టుకు పోయింది.
దాని కింద ఆశ్రయం తీసుకుంటున్న 9 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. జియా లాయ్ ప్రావిన్స్‌లో చేపల వేటకు వెళ్లిన 8 మంది జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆదివారం రాత్రి 3.47 లక్షల నివాసితులు అంధకారంలో గడిపారని అధికారులు తెలిపారు. బ్వాలోయి కారణంగా ఫిలిప్పీన్స్‌లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు.