Operation Sindoor: అజార్‌ కుటుంబసభ్యులు హతం | Indian strikes in Pakistan kill Jaish chief Masood Azhar 10 family members | Sakshi
Sakshi News home page

Operation Sindoor: అజార్‌ కుటుంబసభ్యులు హతం

May 8 2025 3:06 AM | Updated on May 8 2025 3:09 AM

Indian strikes in Pakistan kill Jaish chief Masood Azhar 10 family members

10 మంది మరణించారని స్వయంగా ప్రకటించిన జైషే చీఫ్‌

బహావల్పూర్‌లో భారత దాడిలో మరో నలుగురు హతం

లాహోర్‌: పాకిస్తాన్‌లోని బహావల్పూర్‌ నగరంలో భారత్‌ జరిపిన దాడుల్లో ఉగ్రసంస్థ జైషే మొహహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబంలో పది మంది హతమయ్యారు. ఈ వివరాలను స్వయంగా ఆయనే పాకిస్తాన్‌ మీడియాకు వెల్లడించినట్లు సంబంధిత ప్రకటన పేర్కొంది. 

బహావల్పూర్‌లోని జామియా మసీద్‌ సుభాన్‌ అల్లాహ్‌ శిబిరం సముదాయంపై భారత్‌ జరిపిన క్షిపణి దాడిలో అజార్‌ సోదరి, ఆమె భర్త, అజార్‌ మేనల్లుడు, అతని భార్య, మరో మేనల్లుడు, ఉమ్మడి కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు చనిపోయారు. 

వీరితోపాటే అజార్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అతని తల్లి, మరో ఇద్దరు వ్యక్తులూ మరణించారు. ఈ దాడిలో గాయపడిన వారిని దగ్గర్లోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. 1999లో ఐసీ–814 విమానాన్ని హైజాక్‌ చేశాక దానిని విడిచిపెట్టాలంటే అజార్‌ను వదిలేయాలని హైజాకర్లు డిమాండ్‌చేయడం, తప్పని పరిస్థితుల్లో అజార్‌ను జైలు నుంచి వదిలేయడం తెల్సిందే. 

విడుదలైన నాటి నుంచి అజార్‌ పాకిస్తాన్‌ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలను ఉధృతం చేశాడు. సుభాన్‌ శిబిరం అలియాస్‌ ఉస్మానో అలీ క్యాంపస్‌గా పిలుచుకునే ఈ ప్రాంగణాన్ని జైషే ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయంగా అజార్‌ వినియోగించుకుంటున్నాడు. 18 ఎకరాల ఈ ప్రాంతం నుంచే జైషే ఉగ్రసంస్థలోకి కొత్త వాళ్ల రిక్రూట్‌మెంట్లు, విద్వేష బోధన, శిక్షణ, నిధుల సేకరణ తదితర కార్యకలాపాలు కొనసా గుతుంటాయి. 

2019 మేలో అజార్‌ను ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019 ఏప్రిల్‌ తర్వాత అజార్‌ పెద్దగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. బహావల్పూర్‌లోనే ఉంటున్నట్లు గతంలోనే నిఘా సమాచారం భారత్‌కు అందింది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2000లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీపై దాడి, 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి, 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడులకు అజార్‌ సూత్రధారి అని తెలుస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement