
భారతీయ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి తుర్కియే సంస్థ ఔట్
సెలెబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌కు ఇచ్చిన భద్రతా క్లియరెన్స్ రద్దు
సినిమా, ప్రీవెడ్డింగ్ షూట్‌ల కోసం తుర్కియే, అజర్‌బైజాన్‌లకు వెళ్లొద్దని పౌరులకు సూచన !
పాకిస్తాన్‌కు తుర్కియే సాయంపై భారత్ ఆగ్రహ ఫలితం
ఊపందుకున్న ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ వేళ ఆత్మాహుతి డ్రోన్లు, శిక్షణా సిబ్బందిని పాకిస్తాన్‌కు తరలించిన పాపానికి తుర్కియేపై భారత్ ఆగ్రహం మరింత ఎక్కువైంది. దీంతో తుర్కియేపై నిరసన చర్యల్లో భాగంగా ఆ దేశానికి చెందిన వైమానిక సేవల సంస్థకు గతంలో ఇచ్చిన భద్రతా క్లియరెన్స్‌ను భారత్ రద్దుచేసింది. ఈ మేరకు సెలెబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌కు ఇచ్చిన క్లియరెన్స్‌ను రద్దుచేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) గురువారం ప్రకటించింది.
తుర్కియే మాతృసంస్థకు చెందిన రెండు అనుబంధ సంస్థలను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాల వద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్‌మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధుల నుంచి తప్పించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్, కానూర్, కొచ్చిన్‌లలో సెలెబీ అనుబంధ సంస్థలే గత 15 సంవత్సరాలుగా పలు రకాల సేవలు అందించాయి.
ఈ సంస్థల సిబ్బందే ఇన్నాళ్లూ విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లలో విధుల్లో ఉన్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను వీళ్లే చూసుకున్నారు. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లే నెరవేర్చారు.
ఇకపై ఈ పనులను వేరే సంస్థలకు అప్పగించనున్నారు. బీసీఏఎస్ ఆదేశాలకు అనుగుణంగా ఇకపై ఢిల్లీలో విమానాశ్రయంలో కార్గో సేవలు అందిస్తున్న ‘సెలెబీ ఢిల్లీ కార్గో టెర్మినల్ మేనేజ్‌మెంట్ ఇండియా’ సంస్థతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ (డీఐఏఎల్) గురువారం ప్రకటించింది. ప్రయాణికులకు, సరకు రవాణాకు ఎలాంటి ఇబ్బంది, ఆటంకం కల్గకుండా సత్వర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
జామియా మిలియా సైతం..
విద్యా సంస్థలు సైతం బహిష్కరణ నినాదం చేస్తున్నాయి. ఇప్పటికే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తుర్కియేకు చెందిన ఇనోను యూనివర్సిటీతో ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. తుర్కియేలోని విద్యాసంస్థలతో ఒప్పందాలను తక్షణం నిలిపేస్తున్నట్లు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ గురువారం ప్రకటించింది.
యూనుస్ అమీర్ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం ఆపేస్తున్నట్లు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రకటించింది. పుణె వ్యాపారులు సైతం తుర్కియే ఆపిల్‌లను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. ఇకపై తుర్కియే నుంచి పండ్ల దిగుమతులు ఆపేస్తామన్న ట్రేడర్ల నిర్ణయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్వాగతించారు.
తుర్కియే, అజర్‌బైజాన్‌కు వెళ్లొద్దు!
‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం జోరందుకున్న నేప థ్యంలో ఇకపై పర్యా టకం, ప్రీ–వెడ్డింగ్, సిని మాల చిత్రీకరణల కోసం తుర్కియే, అజర్‌బైజాన్‌లకు వెళ్లొద్దని భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచన చేయబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తుర్కియేలో షూటింగ్ కోణంలో సినీరంగానికి ప్రభుత్వ మద్దతు ఆపేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సినిమా కార్మిక సంఘాలు సైతం కేంద్రసర్కార్ నిర్ణయానికి మద్దతు పలికాయి.
భారతీయ నటులు, నిర్మాతలు తుర్కియేకు ప్రాధాన్యత నివ్వడాన్ని పూర్తిగా మానుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ), ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్(ఏఐసీడబ్ల్యూఏ) కోరాయి. కార్పొరేట్ సమావేశాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను తుర్కియేలో జరపొద్దని ప్రభుత్వం పలు రంగాలకు సూచించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పర్యాటకానికి సంబంధించిన పలు భారతీయ ట్రావెలింగ్ ఏజెన్సీలు బుకింగ్‌లు నిలిపేశాయి. అక్కడి వెళ్లాలని గతంలో భావించిన వాళ్లు భారీ సంఖ్యలో క్యాన్సలేషన్‌లు చేసుకుంటున్నారు.