Security clearance
-
తుర్కియేకు భారీ ఝలక్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ వేళ ఆత్మాహుతి డ్రోన్లు, శిక్షణా సిబ్బందిని పాకిస్తాన్‌కు తరలించిన పాపానికి తుర్కియేపై భారత్ ఆగ్రహం మరింత ఎక్కువైంది. దీంతో తుర్కియేపై నిరసన చర్యల్లో భాగంగా ఆ దేశానికి చెందిన వైమానిక సేవల సంస్థకు గతంలో ఇచ్చిన భద్రతా క్లియరెన్స్‌ను భారత్ రద్దుచేసింది. ఈ మేరకు సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌కు ఇచ్చిన క్లియరెన్స్‌ను రద్దుచేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) గురువారం ప్రకటించింది. తుర్కియే మాతృసంస్థకు చెందిన రెండు అనుబంధ సంస్థలను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాల వద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధుల నుంచి తప్పించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్, కానూర్, కొచ్చిన్‌లలో సెలెబీ అనుబంధ సంస్థలే గత 15 సంవత్సరాలుగా పలు రకాల సేవలు అందించాయి. ఈ సంస్థల సిబ్బందే ఇన్నాళ్లూ విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లలో విధుల్లో ఉన్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను వీళ్లే చూసుకున్నారు. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లే నెరవేర్చారు. ఇకపై ఈ పనులను వేరే సంస్థలకు అప్పగించనున్నారు. బీసీఏఎస్ ఆదేశాలకు అనుగుణంగా ఇకపై ఢిల్లీలో విమానాశ్రయంలో కార్గో సేవలు అందిస్తున్న ‘సెలెబీ ఢిల్లీ కార్గో టెర్మినల్ మేనేజ్మెంట్ ఇండియా’ సంస్థతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ (డీఐఏఎల్) గురువారం ప్రకటించింది. ప్రయాణికులకు, సరకు రవాణాకు ఎలాంటి ఇబ్బంది, ఆటంకం కల్గకుండా సత్వర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. జామియా మిలియా సైతం..విద్యా సంస్థలు సైతం బహిష్కరణ నినాదం చేస్తున్నాయి. ఇప్పటికే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తుర్కియేకు చెందిన ఇనోను యూనివర్సిటీతో ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. తుర్కియేలోని విద్యాసంస్థలతో ఒప్పందాలను తక్షణం నిలిపేస్తున్నట్లు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ గురువారం ప్రకటించింది. యూనుస్ అమీర్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం ఆపేస్తున్నట్లు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రకటించింది. పుణె వ్యాపారులు సైతం తుర్కియే ఆపిల్లను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. ఇకపై తుర్కియే నుంచి పండ్ల దిగుమతులు ఆపేస్తామన్న ట్రేడర్ల నిర్ణయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్వాగతించారు.తుర్కియే, అజర్‌బైజాన్‌కు వెళ్లొద్దు!‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం జోరందుకున్న నేప థ్యంలో ఇకపై పర్యా టకం, ప్రీ–వెడ్డింగ్, సిని మాల చిత్రీకరణల కోసం తుర్కియే, అజర్‌బైజాన్‌లకు వెళ్లొద్దని భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచన చేయబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తుర్కియేలో షూటింగ్ కోణంలో సినీరంగానికి ప్రభుత్వ మద్దతు ఆపేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సినిమా కార్మిక సంఘాలు సైతం కేంద్రసర్కార్ నిర్ణయానికి మద్దతు పలికాయి. భారతీయ నటులు, నిర్మాతలు తుర్కియేకు ప్రాధాన్యత నివ్వడాన్ని పూర్తిగా మానుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ), ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్(ఏఐసీడబ్ల్యూఏ) కోరాయి. కార్పొరేట్ సమావేశాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను తుర్కియేలో జరపొద్దని ప్రభుత్వం పలు రంగాలకు సూచించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పర్యాటకానికి సంబంధించిన పలు భారతీయ ట్రావెలింగ్ ఏజెన్సీలు బుకింగ్‌లు నిలిపేశాయి. అక్కడి వెళ్లాలని గతంలో భావించిన వాళ్లు భారీ సంఖ్యలో క్యాన్సలేషన్లు చేసుకుంటున్నారు. -
ఆ ఎయిర్‌పోర్టుల్లో కెమెరాతోనే సెక్యూరిటీ క్లియరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఇక ఎయిర్‌పోర్ట్‌ల్లో సెక్యూరిటీ క్లియరెన్స్‌లకు భారీ ప్రక్రియకు తెరపడనుంది. విమానం ఎక్కేందుకు బోర్డింగ్ పాస్‌లు అవసరం లేకుండా కెమెరా వైపు చూడటం ద్వారా ముఖకవళికలను గుర్తించే ప్రక్రియను పలు విమానాశ్రయాలు త్వరలో చేపట్టనున్నాయి. ప్రయాణీకుల బోర్డింగ్ ప్రక్రియ కోసం విమనాశ్రయాలు ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నాయి. ప్రధాన మంత్రి డిజీ యాత్ర కార్యక్రమంలో భాగంగా పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూర్ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఈ ఆధునిక వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. కాగా వారణాసి, విజయవాడ, కోల్‌కతా ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకుల బోర్డింగ్ ప్రక్రియలో బయోమెట్రిక్ యాక్సెస్‌ను ప్రవేశపెట్టాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించిన సంగతి తెలిసిందే.ముఖాలను గుర్తించే సాంకేతికతోయకూడిన ఆటోమేటెడ్ సెక్యూరిటీ స్కానర్లను ఎయిర్‌పోర్టుల ప్రవేశ, సెక్యూరిటీ, బోర్డింగ్ పాయింట్స్‌లో ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణీకుల ముఖాలను కెమెరా స్కాన్ చేసి, ఆయా వివరాలను వెరిఫై చేస్తూ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తుందని, క్లియరెన్స్ కోసం సెక్యూరిటీ గేట్ వద్ద ప్రయాణీకులు పడిగాపులు కాసే అవసరం ఉండదని పేర్కొన్నారు.మరోవైపు మూడు ఎయిర్‌పోర్టుల్లో పైటల్ పద్ధతిన బయోమెట్రిక బోర్డింగ్ ప్రక్రియను ప్రవేశపెడుతున్నట్టు ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. -
భద్రత కరువు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి చెంది ‘మాజీ’లయిన జిల్లా నాయకులకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. వారికి ఉన్న భద్రతను తొలగించాలని రాష్ట్రస్థాయిలో ఉండే ‘భద్రతా సమీక్ష కమిటీ’ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు జిల్లాలో వారికి గన్మెన్లను తొలగించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాలో మొత్తం 30 మందికి పైగా మాజీ ప్రజాప్రతినిధుల భద్రతను తొలగించినట్టు సమాచారం. దీంతో వీరంతా ఇప్పుడు తమ భద్రతను పునరుద్ధరించుకునే పనిలో పడ్డారు. భద్రత ఏర్పాటు చేయాలంటూ ఆయా పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సిఫారసులు చేయించుకుంటున్నారు. వారే స్వయంగా లేఖలు రాసి తమ భద్రతను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి విజ్ఞప్తులను పరిశీలించిన జిల్లా పోలీసు యంత్రాంగం ఎవరెవరికి భద్రత ఉంచాలనే అంశంపై ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఓడిపోయిన వారికి ‘నో’ గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండి ఇటీవలి ఎన్నికలలో ఓడిపోయిన నేతలందరికీ దాదాపు భద్రత తొలగించారు. వీరితో పాటు రాజకీయాలతో సంబంధమున్న మరికొందరి ప్రముఖుల భద్రతను కూడా తీసేశారు. ఇలా తీసేసిన వారిలో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు డాక్టర్లు, విద్యాసంస్థల అధిపతులు, ఇతర ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు మాజీ మంత్రులుగా పనిచేసి, ఇప్పుడు ఓడిపోయిన వారు, గెలిచినా ఎమ్మెల్యేలుగా మిగిలిపోయిన వారికి కూడా భ ద్రత త గ్గించేశారు. గతంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఓ ప్రజాప్రతినిధికి మాత్రం గతంలో ఉన్న భద్రతనే కొనసాగిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెపుతున్నాయి. ఇక, మిగిలిన మాజీలందరికీ భద్రతను తొలగించారు. అటు కేంద్రంలో, ఇటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నాయకులు కూడా ఇందులో ఉన్నారు. దీంతో వీరంతా తమ భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నేతలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాము భద్రత లేకుండా ఎందుకు తిరగాలని, తమకు వెంటనే భద్రత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కొందరు మాజీలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆయా నేతల వారీగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ విభాగానికి నివేదిక పంపారు. ఈ నివేదికలో ఎవరికి భద్రత అవసరమో లేదో తెలియజేస్తూ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నివేదికను ఇంటెలిజెన్స్ పరిశీలించిన తర్వాతే.. తొలగించిన మాజీలకు మళ్లీ భద్రత పునరుద్ధరించాలా వద్దా అనే దానిపై జిల్లా పోలీసు యంత్రాంగం నిర్ణయం తీసుకోనుంది.