
రష్యా నుంచి దిగుమతుల గురించి తెలియదన్న అమెరికా అధ్యక్షుడు
ఆయన ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టిన భారత విదేశాంగ శాఖ
రష్యా నుంచి యురేనియం, ఎరువులు, రసాయనాలు
దిగుమతి చేసుకుంటున్న అమెరికా రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య బంధం
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. టారిఫ్‌ల బాంబులు పేలుస్తున్నారు. కానీ, అదే అమెరికా అదే రష్యా నుంచి యురేనియం, ఎరువులు, రసాయనాలు భారీగా దిగుమతి చేసుకుంటోంది. తమ అవసరాల కోసం రష్యాపై ఆధారపడుతోంది. రష్యా నుంచి దిగుమతుల గురించి తనకేమీ తెలియదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. అసలేం జరుగుతోందో తనిఖీ చేస్తానని అన్నారు.
ట్రంప్ మాటల్లోని ద్వంద్వ ప్రమాణాలను భారత విదేశాంగ శాఖ ఎండగట్టింది. ట్రంప్ బుకాయింపులు గణాంకాల సాక్షిగా బహిర్గతమయ్యాయి. నిజానికి అమెరికా–రష్యా మధ్య బలమైన వాణిజ్య బంధం కొనసాగుతోంది. అణు ఇంధన పరిశ్రమల కోసం అమెరికా కంపెనీలు రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం పల్లాడియంను, వ్యవసాయం కోసం ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాయి.
అమెరికా ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే.. అమెరికా–రష్యా మధ్య 2024లో 5.2 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 3.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం సరుకులకు సంబంధించినదే. అమెరికా నుంచి రష్యాకు 528.3 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. రష్యా నుంచి అమెరికా 3 బిలియన్ డాలర్ల సరుకులు దిగుమతి చేసుకుంది.
అంటే రష్యాతో అమెరికాకు 2.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. 2025 ప్రథమార్ధంలో రష్యా నుంచి దిగుమతులు 2.4 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు అమెరికా సెన్సెస్ బ్యూరో, బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలిస్ గణాంకాలు చెబుతున్నాయి నాలుగేళ్ల క్రితం ఇవి 14.14 బిలియన్ డాలర్లుగా ఉండేవి. అయినప్పటికీ 2022 జనవరి నుంచి ఇప్పటిదాకా రష్యా నుంచి అమెరికా 24.51 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకుంది.
→ 2021లో రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయిన ఎరువుల విలువ 1.14 బిలియన్ డాలర్లు. 2024లో ఇది 1.27 బిలియన్ డాలర్లు.
→ 2021లో రష్యా నుంచి యూఎస్‌కు 646 మిలియన్ డాలర్ల విలువైన యురేనియం, ప్లుటోనియం వచ్చాయి. 2024లో 624 మిలియన్ డాలర్లకు తగ్గింది.
→ 2021లో 1.59 బిలియన్ డాలర్ల విలువైన పల్లాడి యం దిగుమతి చేసుకోగా, 2024లో 878 మిలియన్ డాలర్ల సరుకు దిగుమతి చేసుకుంది.
→ రష్యా నుంచి ఇండియా కంటే చైనా అధికంగా చమురు దిగుమతి చేసుకుంటోంది. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ చైనాను ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు.
→ 2024లో చైనా ఏకంగా 62.6 బిలియన్ డాలర్ల చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇండియా దిగుమతులు 52.7 బిలియన్ డాలర్లే. దీనిపై ట్రంప్ నోరు మెదపడం లేదు.