ఇజ్రాయెల్‌-ఇరాన్‌ రెండూ భారత్‌కు మిత్రదేశాలే, కానీ.. | India expresses deep concern on Operation Rising Lion | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ రెండూ భారత్‌కు మిత్రదేశాలే, కానీ..

Jun 13 2025 11:52 AM | Updated on Jun 13 2025 12:22 PM

India expresses deep concern on Operation Rising Lion

ఇరాన్‌ నుంచి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ ఇజ్రాయెల్‌ ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’(Operation Rising Lion) పేరిట సైనిక చర్యకు దిగింది. ప్రతిగా.. ఇరాన్‌ డ్రోన్లతో ఇజ్రాయెల్‌ మీద దాడికి దిగింది. అయితే తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత దేశం స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఇరు పక్షాలను ఉద్దేశించి విజ్ఞప్తి చేసింది.

‘‘ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను భారత్‌ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దాడులు ఎంతో ఆందోళనకరం. భారత్‌ ఇరు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంది. రెండు మాకు మంచి మిత్రదేశాలే. సాధ్యమైన మద్దతు అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అందుకే దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేగానీ, ఉద్రిక్తతలను పెంచే చర్యలను ఏమాత్రం ప్రోత్సహించకూడదు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.

అంతకు ముందు.. ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ప్రారంభించామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 200 యుద్ద విమానాలతో టెహ్రాన్‌ దాకా ఇజ్రాయెల్‌ బలగాలు దూసుకెళ్లాయి. ఇరాన్‌ అణు.. క్షిపణి స్థావరాలను నాశనం చేయడంతో పాటు ఆ దేశ మిలిటరీ చీఫ్‌, కొందరు అగ్ర సైంటిస్టులను హతమార్చాయి. దీంతో ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగింది. 

తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement