చైనా జిత్తులకు అమెరికా, భారత్‌ పైఎత్తు! | Sakshi
Sakshi News home page

చైనా జిత్తులకు అమెరికా, భారత్‌ పైఎత్తు!

Published Thu, Nov 9 2023 8:25 AM

India and America will take out China Arrogance - Sakshi

జిత్తులమారి చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌, అమెరికాలు సిద్ధమవుతున్నాయి. అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంకలో తన ‘గూఢచారి’ నౌకా వ్యవహారాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్న చైనాను అడ్డుకునేందుకు పెట్టుబడుల మంత్రమేస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో ముందుకొచ్చాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న  శ్రీలంకను దోచుకుంటున్న చైనాకు చెక్‌ పెట్టే దిశగా ముందుకు కదులుతున్నాయి.

కొలంబో పోర్ట్‌లో డీప్ వాటర్ షిప్పింగ్ కంటైనర్ టెర్మినల్‌ను నిర్మించడానికి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన బైడెన్‌ ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశానికి చెందిన అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్టును కొలంబోలో ముందుకు తీసుకువెళ్లనుంది. దీంతో చైనా ఆటలకు అడ్డుకట్ట పడనుంది. శ్రీలంకకు చైనా భారీగా అప్పులు ఇచ్చి, అందుకు ప్రతిగా శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవును 99 సంవత్సరాల ఒప్పందం మేరకు ఆక్రమించింది. 

ఇదేవిధంగా చైనా తన ‘గూఢచారి’ నౌకను శ్రీలంకకు పంపింది. ఇది పరిశోధనా నౌక అని సమాచారం. చైనా ఈ నౌక సాయంతో భారత్‌పై గూఢచర్యం చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. చైనా చేస్తున్న ఈ దుర్మార్గపు ఎత్తుగడను తిప్పికొట్టేందుకు, దాని దురహంకారాన్ని తుదముట్టించేందుకు భారత్, అమెరికాలు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. 

కొలంబో పోర్ట్‌ కోసం అమెరికా పెట్టుబడులు పెడుతుండటంతో శ్రీలంకకు ప్రయోజనం చేకూరనుంది. 
అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్.. కొలంబో పోర్ట్‌ను ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయనుంది. శ్రీలంకపై అప్పుల భారం తగ్గేందుకు ఇది దోహదపడుతుందని, దీని కారణంగా మిత్రదేశాలకు మేలు జరుగుతుందని అమెరికా చెబుతోంది.

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీలంకలో అమెరికా పెట్టుబడుల ప్రకటన వెలువడింది. బంగాళాఖాతంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడంలో ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. కాగా చైనా ఇచ్చిన రుణాన్ని తీర్చలేని శ్రీలంక తమ దేశానికి చెందిన హంబన్‌టోటా పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చింది. దీనిపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే చైనా కుయుక్తులతో తన ‘గూఢచారి’ నౌకను కొలంబో పోర్టుకు పంపడంలో విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: గ్రీన్‌ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది?

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement