వేలి గోరు సైజులో పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు!  | IBM introduces the smallest computer chip in the world | Sakshi
Sakshi News home page

వేలి గోరు సైజులో పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు! 

Jun 28 2026 12:50 AM | Updated on Jun 28 2026 12:50 AM

IBM introduces the smallest computer chip in the world

కంప్యూటింగ్‌ రంగంలో మరో రికార్డు నమోదైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక మైక్రోప్రాసెసర్‌పై ఏకంగా పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు (100 బిలియన్‌) అమరిపోయాయి. నానోమీటర్‌ (మనిషి వెంట్రుక కంటే లక్ష రెట్లు తక్కువ సైజు) కంటే తక్కువ సైజున్న ట్రానిస్టర్లతో తయారైన ఈ మైక్రోప్రాసెసర్‌ సైజు మన వేలి గోరు సైజు మాత్రమే! కొన్నేళ్ల క్రితం రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో మైక్రోప్రాసెసర్‌ను సిద్ధం చేసిన ఐబీఎం తాజా ఆవిష్కరణతో తన రికార్డును తానే బద్దలు చేసింది. 

కంప్యూటర్ల మెదడుగా చెప్పుకునే మైక్రోప్రాసెసర్‌పై ఎన్ని ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటే వాటి వేగం అంత ఎక్కువగా ఉంటుంది. ట్రాన్సిస్టర్ల సంఖ్య, కంప్యూటర్ల వేగం రెండూ 18 – 24 నెలలకు ఒకసారి రెట్టింపు అవుతాయని 1965లోనే ఇంటెల్‌ వ్యవస్థాపకుడు గార్డన్‌ మూర్‌ లెక్కకట్టారు. 1971లో ఇంటెల్‌ అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్‌ ‘ఇంటెల్‌ 4004’లో 2,300 ట్రాన్సిస్టర్లు మాత్రమే ఉండేవి. 

ఆ తరువాత మూర్స్‌ లా ప్రకారమే వీటి సంఖ్య, కంప్యూటర్ల వేగం పెరుగుతూ వచ్చింది. అయితే.. ట్రాన్సిస్టర్ల సైజు తగ్గుతున్న కొద్దీ సమస్యలూ పెరిగిపోయాయి. ప్రాసెసర్లు విపరీతంగా వేడెక్కిపోవడం ఇందులో ఒకటైతే విద్యుత్తు వినియోగమూ పెరగడం ఇంకోటి. ఈ నేపథ్యంలో వేగాన్ని పెంచుతూనే వేడిని తగ్గించేందుకు, మైక్రోప్రాసెసర్లలో వేర్వేరు కోర్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. 

ఒక దశ దాటిన తరువాత ఈ టెక్నిక్‌ కూడా పనిచేయకుండా పోయింది. ఇక కంప్యూటర్ల వేగం పెరగదు అని అనుకునే లోపు ఐబీఎం ట్రాన్సిస్టర్లను ఒకదానిపై ఒకటి పేర్చడం మొదలుపెట్టింది. ఈ త్రీడీ అవతారమే తాజాగా అభివృద్ధి చేసిన ఒక నానోమీటర్‌ మైక్రోప్రాసెసర్‌! ఐదేళ్ల క్రితం ఐబీఎం అభివృద్ధి చేసిన మైక్రోప్రాసెసర్‌లో రెండు నానోమీటర్ల సైజు టాన్సిస్టర్లు 5,000 కోట్ల వరకూ ఉండేవి. 

వేగం 50 శాతం ఎక్కువ... 
పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లున్న తాజా మైక్రోప్రాసెసర్‌ రెండు నానోమీటర్లతో తయారైన దాని కంటే 50 శాతం ఎక్కువ వేగంతో పని చేస్తుందని, వాడుకునే విద్యుత్తు కూడా 70 శాతం వరకూ తక్కువని ఐబీఎం తెలిపింది. జనరేటివ్‌ ఏఐ సర్వీసులు మొదలుకొని మొబైల్‌ఫోన్లలోనే క్లౌడ్‌ సేవలతో పనిచేసేందుకు ఈ కొత్త మైక్రోప్రాసెసర్లు బాగా ఉపయోగపడతాయని తెలిపింది. 

తాము కేవలం ఎక్కువ ట్రాన్సిస్టర్లను అమర్చేందుకు మాత్రమే పరిమితం కాకుండా సిలికాన్‌తోపాటు వేర్వేరు ఇతర పదార్థాలను వాడటం ద్వారా ఈ ఘనతలు సాధించినట్లు ఐబీఎం తెలిపింది. ఇదంతా ఒక ఎత్తు. ఇంత సూక్ష్మస్థాయి మైక్రోప్రాసెసర్లను తయారు చేయడం ఇంకో ఎత్తు. తైవాన్‌ సెమీ కండక్టర్‌ దిగ్గజం టీఎస్‌ఎంసీ రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో కూడిన మైక్రోప్రాసెసర్లను గత ఏడాది నుంచే పెద్ద ఎత్తున తయారు చేయడం మొదలుపెట్టింది. 

ఐదేళ్ల క్రితం ఐబీఎం సిద్ధం చేసిన రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్ల ప్రాసెసర్‌ తయారీ రాపిడస్‌ ద్వారా వచ్చే ఏడాది తయారు కానుంది. ఆపిల్‌ కూడా టీఎస్‌ఎంసీ ద్వారా తన లేటెస్ట్‌ ప్రాసెసర్‌ ఎం6ను ఈ ఏడాదే తయారు చేయనుందని అంచనా. అంటే.. ఒక నానోమీటర్‌ ట్రాన్సిస్టర్లతో కూడిన మైక్రోప్రాసెసర్‌ మార్కెట్‌లోకి వచ్చేందుకు ఇంకో ఐదారేళ్లు పడుతుందన్నమాట!  
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement