500 బిలియన్ డాలర్ల సంపద సృష్టే లక్ష్యం!
ఐబీఎం - ఇండియాఏఐ సంయుక్త నివేదిక
భారతదేశం మరో పారిశ్రామిక విప్లవానికి వేదిక కాబోతోంది. 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 500 బిలియన్ డాలర్లకు పైగా అదనపు విలువను జోడించనుందని తాజా నివేదిక వెల్లడించింది. ఐబీఎం ఇన్‌స్టిట్యూట్ ఫర్ బిజినెస్ వాల్యూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియాఏఐ’ సంయుక్తంగా రూపొందించిన ‘ప్రామిస్ టు పవర్: హౌ ఏఐ ఈజ్ రిడిఫైనింగ్ ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్’ అనే నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆశయం గొప్పదే.. కానీ..
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. సర్వేలో పాల్గొన్న 73% మంది వ్యాపార దిగ్గజాలు 2030 నాటికి భారత్ ప్రపంచ ఏఐ లీడర్‌గా అవతరిస్తుందని నమ్ముతున్నారు. ఐదుగురు వ్యాపారవేత్తలలో నలుగురు ఏఐ పెట్టుబడులు నేరుగా దేశ జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
అయితే, వాస్తవ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. సర్వే చేసిన సంస్థల్లో 72% సంస్థలు అంతర్జాతీయ పోటీతో పోలిస్తే తాము ఏఐ అమలులో వెనుకబడి ఉన్నామని అంగీకరించాయి. ఆశయానికి, ఆచరణకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని తగ్గించడమే ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సవాలు.
35 కోట్ల మంది నిపుణులు అవసరం
ఈ నివేదిక ప్రధానంగా నైపుణ్యాల కొరతను ఎత్తిచూపింది. ‘ప్రస్తుతం కేవలం 30% మంది ఉద్యోగులకు మాత్రమే ఏఐ పరిజ్ఞానం ఉంది. 2030 నాటికి ఈ అవసరాలు తీరాలంటే దేశవ్యాప్తంగా 350 మిలియన్ల (35 కోట్లు) ఏఐ నిపుణులు అవసరమవుతారు’ అని అంచనా వేసింది. కేవలం సాంకేతికత ఉండటం ముఖ్యం కాదు. ఆ సాంకేతికతను నడిపించే నైపుణ్యం గల మానవ వనరులు ఉండటమే అసలైన విజయమని నివేదిక పేర్కొంది.
డేటా సార్వభౌమాధికారం
డేటా భద్రత, నియంత్రణ విషయంలో భారతీయ కంపెనీలు కఠినంగా ఉన్నాయి. 74% మంది ఎగ్జిక్యూటివ్‌లు డేటాపై పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నారు. ఖర్చును తగ్గించుకుంటూనే పనితీరును మెరుగుపరచుకోవడానికి 10 మందిలో ఏడుగురు హైబ్రిడ్ క్లౌడ్ నమూనా వైపు మొగ్గు చూపుతున్నారు. స్వదేశీ క్లౌడ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం (77%), డేటా నాణ్యత సరిగ్గా లేకపోవడం (57%) ఏఐ విస్తరణకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.
భారతదేశం కేవలం ఏఐ వినియోగదారుగా మాత్రమే కాకుండా సృష్టికర్తగా ఎదగాలంటే ‘ఇండియాఏఐ ఫ్యూచర్ స్కిల్స్’ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఏఐ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను ఒడిసిపట్టాలి. అప్పుడే 500 బిలియన్ డాలర్ల కల సాకారమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేసి విప్లవాత్మక మార్పులు తెస్తేనే ఈ ఏఐ స్వప్నం సాకారం అవుతుందంటున్నారు.
ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు


