breaking news
Transistor
-
ఇండియా చిప్.. ఇంకెప్పుడు?
‘చంద్రయాన్–3’విజయాన్ని కోట్ల మంది భారతీయులు సంబరంగా ఆస్వాదించారు. కానీ అందులోని ఇబ్బందికర వాస్తవాల్ని కొందరే అర్థం చేసుకున్నారు. అదేంటంటే ఉపగ్రహంలోని కీలక ఎల్రక్టానిక్ వ్యవస్థల్లో వాడిన చాలా సెమీకండక్టర్ చిప్‌లు ఇప్పటికీ మన దగ్గర పరిమితంగానే తయారవుతున్నాయి. ఉపగ్రహంలోనే కాదు. మనం వాడే స్మార్ట్ ఫోన్లు... ల్యాప్‌టాప్‌లు.. టీవీలు.. కార్లలో కూడా!. సెమీ కండక్టర్ చిప్ అంటే ప్రతి ఆధునిక యంత్రానికీ మెదడు. చాలా రకాల చిప్‌లను ఇండియా డిజైన్ చేస్తోంది. కానీ తయారు చేయటంలేదు. అందుకే... స్వదేశీ చిప్ మన కల. మరి సాకారానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎంతవరకూ వచ్చాం? ఇంకెంత దూరం?సాక్షి, బిజినెస్మనిషి చేసిన అద్భుతం... సెమీకండక్టర్ చిప్. వందల కోట్ల ట్రాన్సిస్టర్లు.. మైక్రోస్కోపిక్ స్విచ్‌లు.. కాంతిని మించిన వేగంతో లెక్కలు.. సైజు మాత్రం వేలిగోటి కన్నా స్వల్పం!. ఇదీ... చిప్ స్వరూపం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు డిజిటల్ ప్రపంచం యావత్తూ ఈ చిప్‌ల చుట్టూనే తిరుగుతోంది. చిప్ కనక లేకుంటే ఫోన్లు.. ఇంటర్నెట్.. ఏఐ.. ఎలక్ట్రిక్ వాహనాలు.. శాటిలైట్లు.. ఆధునిక రక్షణ వ్యవస్థలు.. ఏవీ లేనట్టే. టెక్నాలజీకి గుండె లాంటి ఈ చిప్‌లను 21వ శతాబ్దపు ఇంధనంగా ఎకనమిస్టులు పోలుస్తున్నది ఇందుకే. సెమీకండక్టర్ టెక్నాలజీని నియంత్రించే దేశాలకు ఆర్థికంగా, వ్యూహాత్మంగా అత్యంత ప్రాధాన్యమిస్తున్నది కూడా ఇందుకే. ఇండియా వెనకబడిందెక్కడ? భారత్‌లో టెకీల సంఖ్య తక్కువేమీ కాదు. వాళ్లలో ఎన్విడియా, ఇంటెల్, క్వాల్కామ్, ఏఎండీ వంటి చిప్ దిగ్గజాల దగ్గర పనిచేస్తున్న వాళ్లూ ఎక్కువే. పైపెచ్చు చిప్ డిజైన్‌లో ఇండియాకు మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న అనేక చిప్‌ల డిజైన్‌లో భారతీయుల పాత్ర ఎంతో కీలకం. మరి తయారీ మాత్రం తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లోనే ఎందుకు జరుగుతోంది? నిజానికి చిప్ డిజైన్ కష్టమైనదే. కానీ వాటి తయారీ ఇంకా కష్టం. ఆధునిక సెమీకండక్టర్ ఫ్యాక్టరీ నిర్మించాలంటే ఆ టెక్నాలజీలో దశాబ్దాల అనుభవం కావాలి. బిలియన్ల కొద్దీ డాలర్లు కావాలి. అత్యాధునిక యంత్రాలు.. అత్యంత స్వచ్ఛమైన నీరు.. నిరంతరాయ విద్యుత్... వందలకొద్దీ అనుబంధ పరిశ్రమలు కావాలి. ఎందుకంటే ఒక్క ధూళి కణం కూడా మొత్తం చిప్‌ను దెబ్బతీయగలదు మరి!!. అందుకే అతికొద్ది దేశాలే ఈ తయారీ సామర్థ్యాన్ని సాధించగలిగాయి. కోవిడ్‌తో మారిన పరిస్థితి... కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో... చిప్‌ల కోసం కొద్దిమందిపై ఆధారపడితే ఎలా ఉంటుందో ప్రతి దేశానికీ తెలిసొచ్చింది. చిప్‌ల కొరతతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఆటోమొబైల్ ఉత్పత్తి ఆగిపోయింది. ఎల్రక్టానిక్స్ దొరకటం కష్టమైంది. దేశాలు కళ్లు తెరిచాయి. అమెరికా చిప్స్ చట్టం తెచ్చింది. యూరప్ సొంత సెమీకండక్టర్ పాలసీలు ప్రకటించింది. చైనా ఒకవంక ఎగుమతులను నియంత్రిస్తూనే పెట్టుబడులు పెంచింది. భారత్ కూడా చిప్‌ల డిజైన్‌కే పరిమితం కాకూడదని నిర్ణయించుకుంది. తయారీలోకి అడుగుపెట్టే ప్రణాళికలు ప్రకటించింది. చిప్‌ల తయారీ రాత్రికిరాత్రే సాధ్యం కాదు కాబట్టే.. ఇండియా దశలవారీగా ముందుకు వెళుతోంది. డిజైన్... తయారీ... ప్యాకేజింగ్... ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి అనేవి ఒక్కొక్కటిగా సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈ ప్రక్రియలు ఒకదానికొకటి దన్నుగా నిలుస్తాయి. అడుగులు పడుతున్నాయి... దాదాపుగా అంతర్జాతీయ చిప్ డిజైన్ కంపెనీలన్నిటికీ ఇండియాలో ఇంజనీరింగ్ సెంటర్లున్నాయి. వాటిలోని మన టెకీలు స్మార్ట్ఫోన్లు, ఆటోమొబైల్స్, కమ్యూనికేషన్ పరికరాలు, ఏఐకి ప్రాసెసర్లు డిజైన్ చేస్తున్నారు. కానీ డిజైన్ పూర్తయ్యాక విదేశాల్లో తయారవుతున్నాయి. ఆ తయారీ చిత్రాన్ని మార్చడానికి దేశంలోనే తొలి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను టాటా ఎల్రక్టానిక్స్ సంస్థ గుజరాత్లో నిర్మిస్తోంది. తైవాన్‌కు చెందిన పీఎస్ఎంసీ దీనికి టెక్నాలజీ అందిస్తోంది. ఆటోమొబైల్స్, పారిశ్రామిక యంత్రాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్‌లో వాడే 28ఎన్ఎం మెచ్యూర్– నోడ్ చిప్స్‌ను తయారు చేస్తారు. దీంతోపాటు టాటా సంస్థ అస్సాంలో సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్‌నూ నిర్మిస్తోంది. అంటే గుజరాత్లో తయారయ్యే చిప్‌లను అస్సాంలో ప్యాకింగ్ చేస్తారన్న మాట. గుజరాత్‌లోనే అమెరికా మెమొరీ చిప్స్ దిగ్గజం మైక్రాన్ కూడా భారీ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇక్కడ మైక్రాన్ సంస్థ సిలికాన్ వేఫర్స్ తయారీ బదులు వాటి అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. చెన్నైకి చెందిన ‘సీజీ పవర్’కూడా జపనీస్ కంపెనీ రెనెసాస్ ఎలక్ట్రానిక్స్, థాయ్‌లాండ్ సంస్థ స్టార్స్ మైక్రోతో జట్టుకట్టి గుజరాత్లో చిప్ ‘ఓశాట్’ప్లాంట్‌ను నిర్మించింది. చిప్‌ల టెస్టింగ్, ప్యాకేజింగ్ వంటివి చేసే ఈ ప్లాంట్‌లో వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ఇప్పటికే ఆరంభమైంది. మరోవైపు చైనా దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో హెచ్‌సీఎల్ సంస్థ జట్టుకట్టి... డిస్ప్లే డ్రైవర్ చిప్స్ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. ఆటోమొబైల్స్, స్మార్ట్ఫోన్లు, టీవీల్లోని డిస్ప్లే స్క్రీన్లను ఈ చిప్‌లు నియంత్రిస్తాయి. డబ్బుకన్నా... టెక్నాలజీ ముఖ్యం భారత్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్ తయారీ చేపడతామని గతంలోనే వేదాంతా గ్రూప్– ఫాక్స్‌కాన్ ప్రకటించాయి. కానీ వారికి సరైన టెక్నాలజీ భాగస్వామి దొరకలేదు. దీంతో ఫాక్స్‌కాన్ తప్పుకుంది. ప్రాజెక్టు మూలనపడింది. నిజానికి సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి డబ్బులకన్నా టెక్నాలజీ ప్రధానం. పెట్టుబడులు ఎలాగైనా వస్తాయి. కానీ టెక్నాలజీ మాత్రం కొందరి దగ్గరే ఉంది. ఉదాహరణకు చిప్‌ల తయారీకి అవసరమైన డిజైన్ సాఫ్ట్‌వేర్‌లో (ఈడీఏ టూల్స్) కెడెన్స్, సినాప్సిస్, సీమెన్స్ వంటి అతికొద్ది సంస్థలదే ఆధిపత్యం.తయారీకి అత్యంత కీలకమైన లిథోగ్రఫీ యంత్రాలను నెదర్లాండ్స్‌కు చెందిన ఒక్క ఏఎస్ఎంఎల్ సంస్థే తయారు చేస్తోంది. తైవాన్‌కు చెందిన టీఎస్ఎంసీ, దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ వంటి సంస్థలు తయారీ ప్రక్రియలో పట్టు సా«ధించడానికి కొన్ని దశాబ్దాలు శ్రమించాయి. మరి ఇంత క్లిష్టమైన టెక్నాలజీని రాత్రికి రాత్రే కొనుగోలు చేయాలంటే సాధ్యమా? అందుకే భారత్ ఈ ప్రక్రియను సొంతంగా ఆది నుంచీ మొదలుపెట్టడం... పునరావిష్కరించడం వంటి ప్రయత్నాలు చెయ్యకుండా అంతర్జాతీయ దిగ్గజాలతో జట్టుకడుతోంది. భారత్‌లో ‘చిప్’తయారవుతుందా? నిజానికి భారత్‌లో చిప్ తయారు చేయడానికి, దాన్ని ‘భారతీయ చిప్’అనడానికి చాలా తేడా ఉంది. విదేశీ టెక్నాలజీతో... విదేశీ సంస్థల భాగస్వామ్యంతో... వాటి లైసెన్సింగ్ ఒప్పందాల ప్రకారమే దేశంలో తొలుత చిప్‌లు తయారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదేమీ అసహజం కాదు కూడా. ఎందుకంటే భారత్‌లో తొలి మారుతీ కారు తయారయ్యింది సుజుకీ సంస్థ టెక్నాలజీతోనే. ఏళ్లు గడుస్తున్న కొద్దీ భారత ఇంజనీరింగ్ సామర్థ్యాలు పెరిగాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీ సంస్థలు కూడా కార్ల తయారీలోకి ప్రవేశించాయి. ఇపుడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఉత్పత్తిదారులలో ఒకటిగా ఎదిగింది. సెమీకండక్టర్ పరిశ్రమ కూడా ఇదే తరహాను అనుసరించే అవకాశముంది. ఎందుకంటే సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడానికి తైవాన్ దాదాపుగా నాలుగు దశాబ్దాలు శ్రమించింది.వేల మంది సప్లయర్లు, యంత్రాల తయారీదారులు, కెమికల్ కంపెనీలు, పరిశోధక సంస్థలు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది కూడా. భారత్ ఇపుడు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ అవకాశాలైతే అపారం. ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాలు, 5జీ, రోబోటిక్స్, ఆధునిక రక్షణ వ్యవస్థలకు రానున్న దశాబ్దాల్లో వందల కోట్ల అదనపు చిప్‌లు అవసరమవుతాయి. డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ భారత్ డిజైన్– తయారీ– ప్యాకేజింగ్– రీసెర్చ్‌లతో కూడిన పూర్తిస్థాయి చిప్ ఇన్ఫ్రాను నిర్మించగలిగితే అది ప్రపంచంలో అత్యంత ప్రధానమైన టెక్నాలజీ హబ్‌గా మారుతుంది. ఇదీ... రోడ్ మ్యాప్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే... భారతదేశంలో 2027–28లో సెమీకండక్టర్ల తయారీ వాణిజ్యపరంగా మొదలయ్యే అవకాశముంది. అది కేవలం ఆరంభమే. అంతర్జాతీయ సంస్థలతో పోటీపడే స్థాయిలో సెమీకండక్టర్ పరిశ్రమను నిర్మించాలంటే మరో దశాబ్దానికి పైనే పడుతుంది. కాకపోతే తొలిసారిగా భారత్ ఈ రంగంలో వీక్షకుడి స్థాయి నుంచి ఆటగాడి స్థాయికి చేరుకుంది. ట్రాక్‌పై అడుగుపెట్టింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే త్వరలోనే ఫోన్లమీదే కాకుండా ఫోన్లలోని చిప్‌పై కూడా ‘మేడిన్ ఇండియా’అని చూడొచ్చు. -
వేలి గోరు సైజులో పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు!
కంప్యూటింగ్ రంగంలో మరో రికార్డు నమోదైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక మైక్రోప్రాసెసర్‌పై ఏకంగా పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు (100 బిలియన్) అమరిపోయాయి. నానోమీటర్ (మనిషి వెంట్రుక కంటే లక్ష రెట్లు తక్కువ సైజు) కంటే తక్కువ సైజున్న ట్రానిస్టర్లతో తయారైన ఈ మైక్రోప్రాసెసర్ సైజు మన వేలి గోరు సైజు మాత్రమే! కొన్నేళ్ల క్రితం రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో మైక్రోప్రాసెసర్‌ను సిద్ధం చేసిన ఐబీఎం తాజా ఆవిష్కరణతో తన రికార్డును తానే బద్దలు చేసింది. కంప్యూటర్ల మెదడుగా చెప్పుకునే మైక్రోప్రాసెసర్‌పై ఎన్ని ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటే వాటి వేగం అంత ఎక్కువగా ఉంటుంది. ట్రాన్సిస్టర్ల సంఖ్య, కంప్యూటర్ల వేగం రెండూ 18 – 24 నెలలకు ఒకసారి రెట్టింపు అవుతాయని 1965లోనే ఇంటెల్ వ్యవస్థాపకుడు గార్డన్ మూర్ లెక్కకట్టారు. 1971లో ఇంటెల్ అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ ‘ఇంటెల్ 4004’లో 2,300 ట్రాన్సిస్టర్లు మాత్రమే ఉండేవి. ఆ తరువాత మూర్స్ లా ప్రకారమే వీటి సంఖ్య, కంప్యూటర్ల వేగం పెరుగుతూ వచ్చింది. అయితే.. ట్రాన్సిస్టర్ల సైజు తగ్గుతున్న కొద్దీ సమస్యలూ పెరిగిపోయాయి. ప్రాసెసర్లు విపరీతంగా వేడెక్కిపోవడం ఇందులో ఒకటైతే విద్యుత్తు వినియోగమూ పెరగడం ఇంకోటి. ఈ నేపథ్యంలో వేగాన్ని పెంచుతూనే వేడిని తగ్గించేందుకు, మైక్రోప్రాసెసర్లలో వేర్వేరు కోర్లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఒక దశ దాటిన తరువాత ఈ టెక్నిక్ కూడా పనిచేయకుండా పోయింది. ఇక కంప్యూటర్ల వేగం పెరగదు అని అనుకునే లోపు ఐబీఎం ట్రాన్సిస్టర్లను ఒకదానిపై ఒకటి పేర్చడం మొదలుపెట్టింది. ఈ త్రీడీ అవతారమే తాజాగా అభివృద్ధి చేసిన ఒక నానోమీటర్ మైక్రోప్రాసెసర్! ఐదేళ్ల క్రితం ఐబీఎం అభివృద్ధి చేసిన మైక్రోప్రాసెసర్‌లో రెండు నానోమీటర్ల సైజు టాన్సిస్టర్లు 5,000 కోట్ల వరకూ ఉండేవి. వేగం 50 శాతం ఎక్కువ... పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లున్న తాజా మైక్రోప్రాసెసర్ రెండు నానోమీటర్లతో తయారైన దాని కంటే 50 శాతం ఎక్కువ వేగంతో పని చేస్తుందని, వాడుకునే విద్యుత్తు కూడా 70 శాతం వరకూ తక్కువని ఐబీఎం తెలిపింది. జనరేటివ్ ఏఐ సర్వీసులు మొదలుకొని మొబైల్‌ఫోన్లలోనే క్లౌడ్ సేవలతో పనిచేసేందుకు ఈ కొత్త మైక్రోప్రాసెసర్లు బాగా ఉపయోగపడతాయని తెలిపింది. తాము కేవలం ఎక్కువ ట్రాన్సిస్టర్లను అమర్చేందుకు మాత్రమే పరిమితం కాకుండా సిలికాన్‌తోపాటు వేర్వేరు ఇతర పదార్థాలను వాడటం ద్వారా ఈ ఘనతలు సాధించినట్లు ఐబీఎం తెలిపింది. ఇదంతా ఒక ఎత్తు. ఇంత సూక్ష్మస్థాయి మైక్రోప్రాసెసర్లను తయారు చేయడం ఇంకో ఎత్తు. తైవాన్ సెమీ కండక్టర్ దిగ్గజం టీఎస్ఎంసీ రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో కూడిన మైక్రోప్రాసెసర్లను గత ఏడాది నుంచే పెద్ద ఎత్తున తయారు చేయడం మొదలుపెట్టింది. ఐదేళ్ల క్రితం ఐబీఎం సిద్ధం చేసిన రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్ల ప్రాసెసర్ తయారీ రాపిడస్ ద్వారా వచ్చే ఏడాది తయారు కానుంది. ఆపిల్ కూడా టీఎస్ఎంసీ ద్వారా తన లేటెస్ట్ ప్రాసెసర్ ఎం6ను ఈ ఏడాదే తయారు చేయనుందని అంచనా. అంటే.. ఒక నానోమీటర్ ట్రాన్సిస్టర్లతో కూడిన మైక్రోప్రాసెసర్ మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకో ఐదారేళ్లు పడుతుందన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచి నిద్రకూ.. బ్యాక్టీరియాకు లింకు
జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియాను తిట్టుకోండి.. నిద్ర పట్టడం కష్టంగా ఉందా? రాత్రంతా పడకపై అటు ఇటు దొర్లేస్తున్నారా? ఒళ్లు తెలియకుండా నిద్రపోయి ఎంత కాలమైందో అనిపిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ మీ సమాధానం అవును అయితే మీ జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియాను తిట్టుకోండి. ఎందుకంటారా? మన కడుపు, పేగుల్లోని బ్యాక్టీరియాలో వైవిధ్యత తగ్గిపోతే నిద్ర కూడా తగ్గుతుందని చెబుతున్నారు జపాన్‌లోని త్సుకుబా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. గుండె జబ్బులు మొదలుకొని కేన్సర్ వరకు అనేక ప్రాణాంతక వ్యాధులకు బ్యాక్టీరియా వైవిధ్యతలో తేడాలే కారణమని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ శాస్త్రవేత్తలు నిద్రలేమికి బ్యాక్టీరియాకు మధ్య ఉన్న సంబంధాన్ని వెతికే ప్రయత్నం చేశారు. కొన్ని ఎలుకలకు నాలుగు వారాల పాటు బలమైన యాంటీబయాటిక్ మందులు ఇచ్చారు. సాధారణంగా పెంచిన ఎలుకలతో పోలిస్తే మందులు వాడిన వాటి పేగుల్లో ఆహారం జీర్ణమైన తర్వాత ఏర్పడే ద్రవాలు (మెటబోలైట్స్) తక్కువగా ఉన్నట్లు తెలిసింది. సుమారు 60 రసాయనాలు అసలు కనిపించకుండా ఉంటే.. మిగిలిన వాటి మోతాదుల్లో తేడాలున్నట్లు తెలిసింది. ఈ మెటబోలైట్స్ కడుపులో న్యూరో ట్రాన్స్మీటర్లు ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయని, ట్రిప్టోఫాన్ నుంచి సెరటోనిన్‌ను ఉత్పత్తి చేసే మెటబోలైట్స్ కూడా వీటిల్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. యాంటీబయాటిక్ మందులు వాడిన ఎలుకల్లో విటమిన్ బీ–6 మెటబోలైట్స్ కూడా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ మెటబోలైట్స్ నిద్రకు దోహదపడే డోపమైన్, సెరటోనిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. బ్యాక్టీరియా వైవిధ్యత తగ్గిన ఎలుకల ఈఈజీని పరిశీలించినప్పుడు నిద్రలో చాలా తేడాలున్నట్లు స్పష్టమైంది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ బ్యాక్టీరియా వైవిధ్యతను పెంచుకోవడం ఎలా? అనుకుంటున్నారా? చాలా సింపుల్. వీలైనంత సహజ ఆహారం తీసుకోవడమే. పాలు, పెరుగు వంటివి కూడా బాగా ఉపయోగపడతాయి. సొల్యూషన్ లేని పొల్యూషన్.. కరోనా కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోతే.. వాతావరణం కాస్త మెరుగైందని కొన్ని నెలల కింద వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కాలుష్య కారక వాయువుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని అంటోంది ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో). 2020 మొత్తమ్మీద ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయిన కారణంగా గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో 4.2 నుంచి 7.5 శాతం తగ్గుదల మాత్రమే నమోదైందని డబ్ల్యూఎంవో తెలిపింది. అయితే వాతావరణంలో గత పదేళ్ల కంటే ఈ ఏడాది ఎక్కువ వేగంగా ఈ కాలుష్యకారక వాయువులు పేరుకుపోయాయని ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో స్పష్టం చేసింది. ‘దీర్ఘకాలిక ఉద్గారాలతో పోలిస్తే లాక్డౌన్ కారణంగా తగ్గిన ఉద్గారాలు చాలా తక్కువ. సుస్థిరమైన పద్ధతిలో ఉద్గారాల పెరుగుదల గ్రాఫ్‌ను వంచాల్సి ఉంటుంది’అని డబ్ల్యూఎంవో జనరల్ సెక్రటరీ పెట్టేరి తాలాస్ తెలిపారు. హవాయిలోని మౌనాలోవా ప్రాంతంలో వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్ మోతాదు ప్రతి పది లక్షల అణువులకు (పీపీఎం) 411.3గా ఈ ఏడాది నమోదైందని, గతేడాది ఈ సంఖ్య 408.5 అని వివరించారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మోతాదు 2015లోనే 400 పీపీఎంను దాటిపోతే నాలుగేళ్లలోనే ఇంకో 10 పీపీఎం వరకూ పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని తాలాస్ తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా కాలుష్యం పెరుగుతోందని, 2030 నాటికి ఉద్గారాలను సగానికి తగ్గించాలన్న లక్ష్యం నెరవేరాలంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని నివేదిక తెలిపింది. లేదంటే భూతాపోన్నతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరగడమే కాకుండా.. కరువు కారణంగా మరణాలు ఎక్కువ అవుతాయని హెచ్చరించింది. అక్షరాలా లక్షా 20 వేల కోట్ల ట్రాన్సిస్టర్లు! మీ కంప్యూటర్లో ఉన్న మైక్రోప్రాసెసర్‌లో ఎన్ని ట్రాన్సిస్టర్లు ఉంటాయో మీకు తెలుసా? అత్యాధునికమైన ఇంటెల్ ఐ9 ప్రాసెసర్‌ను చూస్తే అందులో కొంచెం అటు ఇటుగా 700 కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఈ మైక్రోప్రాసెసర్ సైజు దాదాపుగా నాలుగు అంగుళాల పొడవు, 4.5 అంగుళాల వెడల్పు, 1.57 అంగుళాల మందం ఉంటుంది. కానీ.. దీనికి రెట్టింపు సైజులో ఉన్న మైక్రోప్రాసెసర్‌లో తాము ఏకంగా లక్ష ఇరవై వేల కోట్ల ట్రాన్సిస్టర్లు ఏర్పాటు చేశామని, ఈ ప్రాసెసర్‌తో నడిచే కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ల కంటే శక్తిమంతమైందని సెరబ్రాస్ సిస్టమ్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూపర్ కంప్యూటర్లపై గత వారం జరిగిన ఒక సదస్సులో సెరబ్రాస్ ఈ మెగా కంప్యూటర్ చిప్ వివరాలను వెల్లడించింది. సెరబ్రాస్ సీఎస్–1 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రాసెసర్ ఇంటెల్ జియాన్ ప్రాసెసర్లతో తయారైన జౌల్ సూపర్ కంప్యూటర్ కంటే 200 రెట్లు ఎక్కువ వేగంగా లెక్కలు చేయగలదు. జౌల్ సూపర్ కంప్యూటర్లో ఒక్కో జియాన్ మైక్రోప్రాసెసర్‌లో 20 కోర్లు.. మొత్తమ్మీద 16,000 కోర్లు ఉన్న బహుళ మైక్రోప్రాసెసర్లు ఉంటాయి. సెరబ్రాస్ సీఎస్–1లో 84 వర్చువల్ మైక్రోప్రాసెసర్లు, 4,539 కోర్లతో కూడిన సిలికాన్ మైక్రోప్రాసెసర్లు మాత్రమే ఉంటాయి. మొత్తం 18 గిగాబైట్ల ర్యామ్‌తో కూడిన సెరబ్రాస్ సీఎస్–1తో కంప్యూటింగ్ శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుందని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్ అని చెప్పుకోవాలని కంపెనీ సీఈవో ఆండ్రూ ఫెల్డ్‌మాన్ తెలిపారు. -
‘కంప్యూటర్’ నగరం!
ఈ ఫొటోను ఓ సారి పరిశీలించండి.. ఏముంది కంప్యూటర్లోని చిప్స్, ట్రాన్సిస్టర్లే కదా అనుకుంటున్నారా.. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అందులో ఓ నగరం ఉంటుంది. అవును ఈ ఫొటోలో ఉన్నది మన్ హట్టన్ నగరం. అదేంటి నిజంగా ఆ నగరం అలాగే ఉంటుందా అని అనుకుంటున్నారా..? అది నిజమైన నగరం కాదు కానీ.. అమెరికాలోని న్యూయార్క్ పక్కనే ఉండే మన్హట్టన్ను పోలి ఉండేలా నిర్మించారు. కంప్యూటర్లోని పనికిరాని వస్తువులను ఉపయోగించి దీన్ని తయారు చేశాడు ఓ స్కూల్ పిల్లాడు. జింబాబ్వేకు చెందిన జేడ్ మెంక్ అనే 17 ఏళ్ల కుర్రాడు ఈ నగరాన్ని రూపొందించేందుకు 3 నెలల సమయం తీసుకున్నాడట. అది కూడా 0.0635:100 నిష్పత్తిలో చిన్న తేడా కూడా లేకుండా మొత్తం నగరాన్ని తీర్చిదిద్డాడు. ఇదంతా కూడా ఆ పిల్లాడి స్కూల్ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడి మరీ తయారు చేశాడు. ఇందుకోసం 27 మదర్‌బోర్డులు, 11 సీపీయూలు, 10 సీఆర్టీ మానిటర్ మదర్‌బోర్డులు, 18 ర్యామ్ స్టిక్‌లు, 12 నోకియా ఈ–సిరీస్ ఫోన్లు, 4 వాచ్‌లు, 4 ఆడియో కార్డులు, 2 టెలిఫోన్లు ఇలా వాడి పాడేసిన వస్తువుల సాయంతో తయారు చేశాడు. మన్‌హట్టన్‌లోని భవంతులు, ఆకాశహర్మ్యాలు ఇలా ఒక్కటేమిటి అచ్చు ఆ నగరాన్ని పోలినట్లే ఆ పిల్లాడు తయారు చేశాడు. ఇదంతా తయారు చేయడానికి మంచి తెలివితో పాటు ఎంతో ఓపిక ఉండాలి కదా..! -
ఆ రేడియో అందరికీ కావాలి!
బాలీవుడ్ భామ అనుష్కశర్మ ఓ రేడియోపై మనసు పడ్డారు. ఆ ట్రాన్సిస్టర్ గొప్పతనం ఏంటి? అదంటే అనుష్కకు ఎందుకంత ఇష్టం అనుకుంటున్నారా? ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌కు జోడీగా అనుష్క ‘పీకే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా రేడియోను అడ్డుపెట్టుకొని ఆమిర్ నగ్నంగా నిలబడ్డ స్టిల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ స్టిల్ పుణ్యమా అనీ, ఆమిర్‌కు దీటుగా ఆ రేడియో కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది. కథలో ఆ రేడియోది కీలక పాత్ర అట. ప్రచారంలో కూడా దానికంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమదే. ఒక జ్ఞాపకంగా ఆ రేడియోను తన వద్దే దాచుకోవాలని భావించారట ఈ ముద్దుగుమ్మ. చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, కథానాయ కుడు ఆమీర్ఖాన్ల ముందు తన కోరిక చెప్పారట అనుష్క. అయితే... వాళ్లిద్దరూ ససేమిరా అన్నారట. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ హిరానీ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘అనుష్క ఆ రేడియా అడిగిన మాట నిజం. అయితే... ఆమెలాగే... మేము కూడా దానిపై మమకారం పెంచుకున్నాం. దాన్ని గుర్తుగా దాచుకోవాలని ఆమిర్‌కీ, నాకూ కూడా ఉంది’’ అని పేర్కొన్నారు రాజ్‌కుమార్. ఇంతమంది మనసు దోచిన ఆ ట్రాన్సిస్టర్ గొప్పతనమేంటో తెలుసుకోవాలంటే... ‘పీకే’ వచ్చేదాకా ఆగాలి. -
ట్రాన్సిస్టర్ ధరించి.. అనుష్క వచ్చేసింది!!
అచ్చం అమీర్‌ఖాన్ లాగే ట్రాన్సిస్టర్ ధరించి వచ్చేస్తున్నానంటూ ట్విట్టర్లో హడావుడి చేసిన అనుష్కా శర్మ.. అన్నట్లు గానే ఓ ట్రాన్సిస్టర్ పట్టుకుని వచ్చింది. అయితే, తనకు సరిపోయేదాని కంటే చాలా ఎక్కువ సైజులో ఉన్న పోలీసు యూనిఫాం వేసుకుని, ట్రాన్సిస్టర్ తగిలించుకుని వచ్చింది. పి.కె. చిత్రం మోషన్ పోస్టర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ సినిమాలో అమీర్‌ఖాన్, అనుష్కాశర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనుష్క వచ్చేసిందంటూ అమీర్‌ఖాన్ ముందుగా ట్వీట్ చేసి, అందులో యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చాడు. ''ఏ దేఖా.. హమార్ జగ్గు.. ట్రాన్జిస్టర్ కే సాథ్.." అని అందులో అమీర్ అన్నాడు. సినిమాలో అనుష్కాశర్మ పాత్ర పేరు జగత్ జనిని. ఆ తర్వాత మళ్లీ అనుష్క మరో ట్వీట్ ఇచ్చింది. 'గందరగోళం పడ్డారా? నేను పి.కె. కాను. నా పేరు జగత్ జనిని. అవును జగత్ జనిని' అని చెప్పింది. ఆ తర్వాత మోషన్ పోస్టర్లో ఇద్దరూ జైల్లో ఉన్నట్లు, సైకిల్ మీద ఉన్నవి.. ఇలా పలు ఫొటోలు ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమాలో అమీర్ పాత్ర ఏంటో, అనుష్క పాత్ర ఏంటో తెలియదు గానీ, ట్రాన్సిస్టర్‌కు మాత్రం ప్రధాన పాత్ర ఉందని అర్థమైపోతోంది. For those who haven't seen it yet .. Meet Jagat Janani & tell me what you think 😊 http://t.co/eR1SC3kqvv — ANUSHKA SHARMA (@AnushkaSharma) October 17, 2014 Ei dekha..... humaar Jaggu.... tiranjister ke saath... http://t.co/HmKnqcGOmL — Aamir Khan (@aamir_khan) October 16, 2014 -
ట్రౌజర్ ఎందుకు... ట్రాన్సిస్టర్ చాలు....
-
ట్రాన్సిస్టర్
ఎలా పనిచేస్తుంది? టేప్రికార్డర్లు, ఎంపీత్రీలు, ఎంపీఫోర్లు అంతగా వాడకంలోకి రాని రోజుల్లో ప్రధాన వినోద సాధనంగా అప్పట్లో అందరూ ట్రాన్సిస్టర్ని అధికంగా వాడేవారు. దీనినే ట్రాన్సిస్టర్ రేడియో అనేవారు. వాస్తవానికి రేడియోలాగా వుండే ఈ సాధనం పూర్తి - ‘ట్రాన్సిస్టర్ రేడియో రిసీవర్’. ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. - ‘ట్రాన్సిస్టర్’ సిలికాన్, జర్మేనియం వంటి సెమీ కండక్టర్ లోహలతో తయారై వుంటుంది. - ట్రాన్సిస్టర్‌లో రెండురకాలు వుంటాయి. జంక్షన్ ట్రాన్సిస్టర్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. - మొదటిరకం దాన్ని మూడు పొరలుగా చేస్తారు. రెండు పొరల మధ్య ఒకరకమైన సెమీ కండక్టర్ వుంచుతారు. పైన, కింది పొరలు సెమీ కండక్టర్ కంటే భిన్నమైనవి. - మధ్యపొరను లేస్ అనీ, బయటిపొరను ఎమిటర్ అనీ అంటారు. మరొకటి కలెక్టర్. - బేస్‌ను ఎమిటర్తో, కలెక్టర్‌తో కలిపే రెండు జంక్షన్లు వుంటాయి. - ఎలక్ట్రానులు ఎమిటర్ నుండి బేస్ ద్వారా కలెక్టర్‌కు ప్రవహిస్తాయి. అప్పుడు విద్యుత్ జనిస్తుంది. - బేస్‌లో ఎలక్ట్రాన్లు వుంటాయి. అవి తమలోనుండి వెళ్లే ఎలక్ట్రాన్ ప్రవాహన్ని నిలిపి వేస్తాయి. - ఓల్టేజిలో మార్పులను ఇది అదుపుచేస్తుంది. వోల్టేజి ఏమాత్రం పెరిగినా, ఎమిటర్ నుండి కలెక్టర్‌కు వెళ్లే విద్యుత్ ప్రవాహంలో మార్పు వస్తుంది. అంటే రేడియో, టీవీలలో ఉండే ఈ చిన్న పరికరం ఎంత సమర్థంగా పని చేస్తే అవి కూడా అంత సమర్థంగా పని చేస్తాయన్నమాట.


